వీర్రాజు ఆశలు జీవీఎల్ కలలు బద్ధలు

Sat Mar 18 2023 17:00:01 GMT+0530 (India Standard Time)

News on BJP somu veerraju ap MLC elections

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో అంతా టీడీపీ వైసీపీల లెక్కలే మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ బొక్కబోర్లా పడిన విషయం కూడా ఏపీ పాలిటిక్సులో ఇంట్రెస్టింగ్గానే ఉంది. టీడీపీ మూడు పట్టభద్రుల స్థానాలను గెలుచుకోవడంతో అది జనం తీర్పుగా అంతటా వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఇది నిదర్శనమని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఓటమికి ఇదే బీజమని చెప్తున్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో సిటింగ్ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడంతో బీజేపీ గొంతులో వెలక్కాయ పడింది. ఈ ఒక్క ఫలితం బీజేపీ ముందు ఎన్నో ప్రశ్నలను ఉంచింది.ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలలో సిటింగ్ ఎమ్మెల్సీ మాధవ్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఆయనకు సుమారు 11 వేల ఓట్లు వచ్చాయి. మొత్తం పోలయిన ఓట్లలో 1/6వ వంతు కూడా రాకపోవడంతో డిపాజిట్ కోల్పోయారు. ఉత్తరాంధ్ర విషయంలో బీజేపీ అనుసరించిన విధానాలే ఈ పరిస్థితికి కారణమన్నది ప్రజల్లో వినిపిస్తున్న మాట. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం బీజేపీపై తీవ్ర ప్రభావం చూపింది.

కేంద్రంలోని తమ సర్కారు నిర్ణయం కావడంతో మాధవ్ కానీ ఏపీ బీజేపీలోని ఇతరులు కానీ దానిపై మౌనముద్రే దాల్చేవారు. ఆ ఫలితం ఇప్పుడు ఓటమి రూపంలో వారికి కనిపించింది. ఇక రెండోది విశాఖ రైల్వే జోన్... స్టీల్ ప్లాంట్తో సమానంగా ఉత్తరాంధ్ర ప్రజలలో సెంటిమెంట్ రగిల్చిన అంశం రైల్వే జోన్. ఈ విషయంలో బీజేపీ నాన్చుడు ధోరణి కూడా పట్టభద్రులలో ఆగ్రహం తెప్పించింది.

ఇక బీజేపీ పరంగా చూస్తే ఇక్కడి నుంచి ఎంపీగా గతంలో గెలిచిన కంభంపాటి హరిబాబును బీజేపీ గవర్నరును చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా కాలికి బలపం కట్టుకుని వైజాగ్లో తిరిగి ఓట్లడిగారు. బీజేపీ రాజ్యసభ సబ్యుడు జీవీఎల్ నరసింహారావు అయితే విశాఖలోనే ఇల్లు కట్టుకుని ఉంటున్నారు.. ఆయన ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటుడడంతో తాను కూడా మాధవ్ కోసం పనిచేశారు. ఏపీ బీజేపీ కోకన్వీనర్ సునీల్ దేవధర్ కూడా తిరిగారు.. కానీ ఎవరూ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు.

మరోవైపు బీజేపీ తమకు జనసేన మద్దతు ఉందని చెప్పినా నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా జనసేన నేతలు కానీ కార్యకర్తలు కానీ బీజేపీతో కలవలేదు. విశాఖకే చెందిన విష్ణు కుమార్ రాజు వంటి సీనియర్లు బీజేపీపై ఆగ్రహంతో ఈ ఎన్నికలలో యాక్టివ్గా పనిచేయలేదు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నుంచి నిష్క్రమించడం కూడా బీజేపీని కొంత దెబ్బతీసింది. ఈ కారణాలన్నీ కలిపి మాధవ్ ఓటమికి దారి తీశాయి.

బలమైన అభ్యర్థి అనుకున్న పీవీఎన్ మాధవ్ కూడా డిపాజిట్ సాధించలేకపోవడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమిటనేది స్పష్టమవుతోంది. కేవలం కేంద్రంలోని మోదీ అమిత్ షాలను చూపించి ఓట్లడిగితే ఏపీలో ఒక్క సీటు కూడా రాదని ఈ ఎమ్మెల్సీ ఎన్నికతోనైనా బీజేపీకి అర్థం కావాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.