Begin typing your search above and press return to search.

మినిష్టర్ రోజా...నవంబర్ గండం దాటేనా...?

By:  Tupaki Desk   |   1 Oct 2022 12:30 AM GMT
మినిష్టర్ రోజా...నవంబర్ గండం దాటేనా...?
X
జగన్ తన మంత్రివర్గంలో నుంచి కచ్చితంగా నలుగురైదుగురిని నవంబర్ నెలలో జరిగే విస్తరణలో తప్పిస్తారు అని ప్రచారం జోరుగా సాగుతోంది. అంటే మొత్తం పాతిక మంది మంత్రులలో ఇది అయిదవ వంతు అన్న మాట. మిగిలిన వారిలో కూడా ఎంతో కొంత నిర్లక్ష్యంగా ఉంటున్న వారికి ఇది హెచ్చరికగా పనిచేస్తుంది అన్నదే వైసీపీ హై కమాండ్ వ్యూహం అని చెబుతున్నారు.

దాంతో ఎవరా నలుగురైదుగురు అన్న చర్చ ముందుకు వస్తోంది. వీరిలో ఉత్తరాంధ్రా నుంచి ఒక మంత్రి డ్యాం ష్యూర్ గా ఉంటారని అంటున్నారు. గోదావరి జిల్లాలలో ఒక మహిళా మంత్రితో పాటు రాయలసీమలో మరో మంత్రి, కోస్తాలో ఇంకొకరు ఉంటారట. వీరి విషయం ఎలా ఉన్నా ఎక్కువగా వినిపించే పేరు ఆర్కే రోజా అని అంటున్నారు.

ఆమె మంత్రి అయ్యాక వైసీపీ హై కమాండ్ సూచనలను పెద్దగా పట్టించుకోవడం మానేశారు అని అంటున్నారు. తన సొంత అజెండా మేరకే ఆమె వ్యవహరిస్తున్నారు అని కూడా చెబుతున్నారు. ఇక జబర్దస్త్ కార్యక్రమాలకు వెళ్లకూడదు అని అంటున్నా రోజా మాత్రం ఆ వైపు నుంచి తన ఆలోచనలను మార్చుకోలేకపోతున్నారు అని అంటున్నారు. తాజాగా దసరా సందడి పేరిట జబర్దస్త్ లో ఒక ఈవెంట్ నిర్వహిస్తే మంత్రి అయి ఉండి రోజా దానికి వెళ్లడం పట్ల పార్టీ వర్గాలు షాక్ తిన్నాయట.

క్యాబినేట్ ర్యాంక్ మంత్రికి ఇది అవసరమా అని కూడా అంటున్నారుట. దీని మీద జగన్ కి ఫిర్యాదులు వెళ్లాయని చెబుతున్నారు. అంతే కాదు, ఆమె మంత్రి అయిన వెంటనే నేరుగా తెలంగాణా సీఎం కేసీయార్ ని కలసి ఆశీస్సులు తీసుకోవడం తో నాడే పార్టీ వర్గాలు ఖంగు తిన్నాయట. ఒక రాష్ట్ర సీఎం ని కలవాలి అంటే మంత్రి స్థాయిలొ ఉన్న వారు పార్టీ అనుమతి లేకుండా చేసే ప్రసక్తే ఉండదు. కానీ రోజా తన పాత పరిచయాలను కలుపుకుని ఆయన్ని కలసి వచ్చారు.

ఇక ఆమె జగన్ వ్యతిరేకులను కూడా కలుస్తున్నారు అన్న చర్చ కూడా పార్టీలో ఉంది అంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ ప్రొగ్రాం ప్రసారం అయ్యే అ చానల్ జగన్ నిత్యం దుష్ట చతుష్టయం అని నిందించే వారిలో మొదటి పేరులో ఉన్న వారిదే కావడంతో ఎప్పటి నుంచో ఆ విషయం వైసీపీ వారు రోజాకు చెబుతూ వచ్చారట. కానీ ఆమె ఎమ్మెల్యేగా ఉన్నాను అంటూ ఇన్నాళ్ళూ అక్కడ జడ్జిగా ఉన్నారు. మంత్రి అయినా కూడా అక్కడికే వెళ్లడంతో ఇక లాభం లేదు చెక్ పెట్టాల్సిందే అన్న ఆలోచనకు వచ్చారని అంటున్నారు.

ఇక అయిదు నెలల మంత్రిగా రోజా తన నియోజకవర్గంలో కానీ ఏపీలో తన శాఖ విషయంలో కానీ పెద్దగా దృష్టి పెట్టలేదని నివేదికలు ఉన్నాయి. తాజాగా జరిగిన వర్క్ షాప్ లో గడప గడపకు ప్రోగ్రాం కి సరిగ్గా వెళ్ళని వారిలో రోజా పేరు కూడా ఉంది. ఇక ఆమె గుళ్ళూ గోపురాలు తిరుగుతూ తన సొంత ఇమేజ్ ని పెంచుకుంటున్నారు అని అంటున్నారు. అదే సమయంలో ఆమె గతంలో మాదిరిగా ఫైర్ బ్రాండ్ గా విపక్షాలను చీల్చి చెండాడం లేదు అన్నది కూడా హై కమాండ్ గుర్తించింది అని అంటున్నారు. మరి ఏ విధంగా పార్టీ కోసం పనిచేయని ఆమెని తప్పించి ఆ ప్లేస్ లో సరైన వారికి పదవి ఇస్తే తప్పేంటి అన్న చర్చ కూడా సాగుతోందిట.

ఇక నగరిలో చూసుకున్నా వివిధ సర్వేలలో రోజా గ్రాఫ్ బాగా డౌన్ అయినట్లుగా చెబుతున్నాయి. ఆమె తన సొంత నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టకపోతే ఎలా అన్నది కూడా పార్టీని పట్టి పీడిస్తున్న సమస్యగా ఉంది. ఇవన్నీ చూసుకుంటే రోజా పదవి పోవడం ఖాయమే అంటున్నారు. మరి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఏకంగా జగన్ కే ఆగ్రహం కలిగించే విధంగా ఉన్న వ్యవహారశైలితో రోజా పదవిలో కొనసాగడం కష్టమే అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.