Begin typing your search above and press return to search.

బీజేపీ ని వెంటాడుతున్న నోటా, చెల్లని ఓట్లు

By:  Tupaki Desk   |   19 March 2023 6:00 AM GMT
బీజేపీ ని వెంటాడుతున్న నోటా, చెల్లని ఓట్లు
X
రాష్ట్రంలో బీజేపీ పరిస్ధితి చాలా దయనీయంగా తయారైంది. తాజాగా వెల్లడైన ఎంఎల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేదు ఫలితాలు ఎదురైంది. మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మాధవ్, దయాకర్ రెడ్డి, రాఘవేంద్రలకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఉత్తరాంధ్ర నియోజకవర్గాలకు పీవీఎన్ మాధవ్ పోటీ చేశారు. తూర్పు రాయలసీమ నియోజకవర్గానికి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గానికి నగరూరు రాఘవేంద్ర పోటీచేశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మాధవ్ సిట్టింగ్ సీటులో గెలుపు కోసం పోటీ చేస్తే మిగిలిన ఇద్దరు గెలుపుకోసం పోటీచేశారు. అయితే ముగ్గురికీ డిపాజిట్లు దక్కలేదు. విచిత్రం ఏమిటంటే వీళ్ళకి వచ్చిన ఓట్లకన్నా చెల్లని ఓట్లే ఎక్కువ. అత్యధికంగా ఉత్తరాంధ్రలో సుమారు 13 వేల ఓట్లు చెల్లనివిగా తేలితే మాధవ్ కు పోలైన ఓట్లు సుమారు 9 వేలు మాత్రమే. ఇదే పద్దతిలో దయాకరరెడ్డి, రాఘవేంద్రకు వచ్చిన ఓట్లకన్నా చెల్లని ఓట్లే ఎక్కువ.

ఇపుడు చెల్లని ఓట్లు బీజేపీపై ఆధిక్యత చూపిస్తే 2019 ఎన్నికల్లో బీజేపీకన్నా నోటా(నన్ ఆఫ్ ది ఎబోవ్)కి ఎక్కువ ఓట్లు వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో నోటాకు వచ్చిన ఓట్లు సుమారు 3 శాతమైతే బీజేపీకి వచ్చిన ఓట్లు 0.56 శాతం. ఈ మధ్యలో ఒక పార్లమెంటు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగితే వీటిల్లో కూడా బీజేపీకి డిపాజిట్లు రాలేదు. అంటే గ్రౌండ్ రియాలిటీని చూస్తుంటే ఇదే ఓటింగ్ సరళి రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రిపీటయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పార్టీకి ఇంత దీనస్ధితికి కారణం ఏమిటి ? ఏమిటంటే ఏపీ ప్రయోజనాలను నరేంద్రమోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తుండటమే. పోలవరంకు నిధులివ్వటం లేదు, ప్రత్యేకహోదా ఇవ్వలేదు, వైజాగ్ ప్రత్యేక రైల్వేజోన్ లేదు ఇలా ఏ విషయం తీసుకున్నా ఏపీని దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. చివరకు విశాఖ స్టీల్స్ ను కూడా ప్రైవేటీకు అప్పగించేస్తోంది. ఇలాంటి అనేక కారణాలతో జనాలు బీజేపీ మీద తమ ధర్మాగ్రహాన్ని చూపిస్తున్నారు. ఈ విషయాన్ని కమలనాదులు గ్రహిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.