Begin typing your search above and press return to search.

అనుబంధ సంఘాల అధ్య‌క్షుల‌తో వైఎస్సార్సీపీ దూకుడు పెంచ‌నుందా?

By:  Tupaki Desk   |   29 Jun 2022 4:17 AM GMT
అనుబంధ సంఘాల అధ్య‌క్షుల‌తో వైఎస్సార్సీపీ దూకుడు పెంచ‌నుందా?
X
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని నియమించారు. ఇప్ప‌టికే ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మ‌న్ గా ఉన్న విష‌యం తెలిసిందే.

అలాగే చీరాల‌కు చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత‌కు మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన పోతుల సునీతకు ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి యువ‌త‌లో గుర్తింపు ఉంద‌ని చెబుతున్నారు. సిద్ధార్థ్ రెడ్డి, సునీత ఇద్ద‌రూ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై విరుచుకుప‌డాల్సి ఉంటుంది.

టీడీపీ నుంచి ఆ పార్టీ మ‌హిళా వంగ‌ల‌పూడి అనిత వైఎస్సార్సీపీపై తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్సీపీలో రాష్ట్ర‌వ్యాప్తంగా పేరున్న సిద్ధార్థ్ రెడ్డికి, పోతుల సునీత‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైత్య‌ను, సాంస్కృతిక విభాగం అధ్య‌క్షురాలిగా వంగ‌పండు ఉష‌ను, బీసీ సెల్ అధ్య‌క్షుడిగా ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తిని నియ‌మించారు.

అదేవిధంగా రైతు విభాగం అధ్య‌క్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డి, కార్మిక విభాగానికి గౌత‌మ్ రెడ్డిని, వాణిజ్య విభాగానికి ఎమ్మెల్యే వెలంప‌ల్లి శ్రీనివాస్ ను, సేవాద‌ళ్ అధ్య‌క్షుడిగా ఎమ్మెల్సీ రుహుల్లాను నియ‌మించారు.

వీరితోపాటు సోష‌ల్ మీడియా విభాగానికి ఏకంగా నలుగురు.. గుర్రంపాటి దేవేంద్ర‌రెడ్డి, పుట్టా శివ‌శంక‌ర్, చ‌ల్లా మ‌ధుసూద‌న్ రెడ్డి, పామిరెడ్డి మ‌ధుసూద‌న్ రెడ్డిల‌ను నియ‌మించారు. ప్ర‌చార విభాగానికి సీఎం స‌ల‌హాదారు ఆర్.ధ‌నుంజ‌య‌రెడ్డిని అధ్య‌క్షుడిగా నియ‌మించారు.

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకుని ఈ నియామ‌కాల‌ను చేసిన‌ట్టు చెబుతున్నారు. వీరంతా ఇప్ప‌టి నుంచే పార్టీ త‌ర‌ఫున కార్య‌క‌లాపాల‌ను వేగ‌వంతం చేయాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. ఇక రాష్ట్ర కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి గా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మ‌న్ గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉంటారు.