ఐపీఎల్.. రూపుమారనున్న జట్లు.. ఎవరు ఎవరిని రిటైన్ చేసుకుంటాయంటే

Sat Nov 27 2021 15:02:02 GMT+0530 (IST)

New teams are set to make their debut in the IPL

ఆట.. ఆకర్షణ రెండూ కలగలసినది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). భారీ హిట్టర్లు.. భీకరమైన బౌలర్లు.. చురుకైన ఆల్ రౌండర్ లు అందరూ ఒక జట్టులో చేరితే ఎలా ఉంటుందో మన కళ్లకు కట్టినట్టు కనిపించే వేదిక ఇది. అంతేకాదు భారత క్రికెట్ స్థాయిని అమాంతం పెంచిచిన లీగ్. సహజంగానే బీసీసీఐ పలుకుబడితో ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ గా అవతరించింది. అందుకే ఏ దేశ ఆటగాళ్లయినా ఐపీఎల్ ఆడేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు.కొత్త కొత్తగా 15వ ఎడిషన్

14 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఐపీఎల్ ఈసారి 15 వ సీజన్ లోకి అడుగు పెట్టబోతోంది. అంతేకాదు.. మరింత కొత్తగా కనిపించబోతోంది. రెండు కొత్త జట్ల చేరికతో పాటు ఇప్పటికే ఉన్న జట్లలో ఆటగాళ్ల మార్పులు జరుగనున్నాయి. అది కూడా మామూలుగా కాకుండా భారీఎత్తున జరుగనున్నాయి.

వేటు ఎవరిపై.. రిటైన్ ఎవరు?

ఈ సారి వేలంలో ఒక్కొక్క జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లోకి రంగప్రవేశం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ టీమ్ ఏ ఆటగాడిని రిటైన్ చేసుకుంటుందో.. ఏ ఆటగాడు వేలంలోకి వస్తాడో అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి.

క్రిక్ బజ్ వెబ్‌సైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు బుమ్రా పొలార్డ్ ఇషాన్ కిషన్‌లను రిటైన్ చేసుకుందని తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ ఆల్‌రౌండర్ జడేజా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు మొయిన్ అలీ లేదా సామ్ కరన్ లేదా డుప్లెసిస్‌లో ఒకరిని రిటైన్ చేసుకోనుందట.

బెంగళూరు జట్టు విషయానికి వస్తే కోహ్లీ దీపక్ పడిక్కల్ మ్యాక్స్‌వెల్‌తో పాటు చాహల్ లేదా సిరాజ్‌లలో ఒకరిని రిటైన్ చేసుకోబోతుందని సమాచారం. సన్‌రైజర్స్ టీమ్ విలియమ్సన్ రషీద్ ఖాన్‌లను మాత్రమే రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

దీంతో వార్నర్ వేలంలోకి రావడం పక్కా అని తేలిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రిషబ్ పంత్ పృథ్వీ షా అక్షర్ పటేల్ నోర్జ్‌లను రిటైన్ చేసుకోనుంది. దీంతో శిఖర్ ధావన్ శ్రేయాస్ అయ్యర్ వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది. అటు రాజస్థాన్ రాయల్స్ టీమ్ సంజు శాంసన్ బట్లర్ యశస్వి జైశ్వాల్‌ను… పంజాబ్ టీమ్ రవి బిష్ణోయ్ అర్ష్ దీప్‌సింగ్‌లను రిటైన్ చేసుకోనున్నాయి. అయితే అధికారికంగా ఇదంతా ప్రకటించ లేదు. త్వరలోనే ఆయా జట్లు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను వెల్లడించే వీలుంది.

రిటైన్ అయితే వీరి స్థాయి పెరిగినట్టే..

ధోని కోహ్లి రోహిత్ రిటైన్ పెద్ద విషయం కాదు. వీరు రిటైన్ కాకుంటేనే వార్త. అయితే ఈసారి వేలంలో రిటైన్ అయితే కొందరు కుర్రాళ్ల స్థాయి పెరుగుతుంది. ఉదాహరణకు ఇషాన్ కిషన్ యశస్వి జైస్వాల్ పృథ్వీ షా రుతురాజ్ గైక్వాడ్ వంటి వారు రిటైన్ అయితే వారికి టీమిండియా ద్వారాలు తెరుచుకున్నట్టే లెక్క. ఎంతోమంది స్టార్లు ఉండగా.. వారిని కాదని వీరిని రిటైన్ చేసుకోవడం అంటే పెద్ద విషయమే కదా? కేవలం నలుగురినే అట్టిపెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు అందులో వీరు ఉన్నారంటే గొప్పే కదా?