Begin typing your search above and press return to search.

కొవిడ్ పై న్యూయార్క్ టైమ్స్ చెప్పిన కొత్త ‘కథ’

By:  Tupaki Desk   |   18 March 2023 6:00 PM GMT
కొవిడ్ పై న్యూయార్క్ టైమ్స్ చెప్పిన కొత్త ‘కథ’
X
ఇప్పటి పిల్లలు కాదు కానీ.. దాదాపు నలభై ఏళ్ల క్రితం పుట్టిన వారంతా చిన్నతనంలో తప్పనిసరిగా చదివే కథల్లో ఒకటి.. చేపా చేపా ఎందుకు ఎండలేదని. దానికి అటు ఇటు తిప్పి.. చివరకు కారణం చెప్పేస్తారు. ఇంత పెద్ద సాంకేతికత అందుబాటులో ఉండి.. ఇంట్లో కూర్చోనే ప్రపంచాన్ని చక్కదిద్దే అవకాశం ఉన్న వేళ..యావత్ ప్రపంచం కలిసి.. చైనాలో పుట్టి.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్ మహమ్మారికి కారణం ఏమిటన్న విషయాన్ని దాదాపు మూడేళ్లు అవుతున్నా ఇంకా తేల్చలేని దుస్థితి. ఇదంతా చూసినప్పుడు.. మనం చెప్పుకునే అత్యాధునిక సాంకేతికత అన్న మాటలకు.. గొప్పలకు ‘షరతులు వర్తిస్తాయి’ అన్న ట్యాగ్ ను తప్పనిసరిగా తగిలించుకోవాలన్న భావన కలుగక మానదు.

కొవిడ్ మహమ్మారికి కారణం వూహాన్ లోని చేపల మార్కెట్ అని కొందరు.. కాదు అక్కడి ల్యాబ్ చేసిన పాపమే అని మరో వాదన వినిపించే వేళ.. మొన్నటివరకు వినిపించిన గబ్బిలాల కథకు ఉప కథ మరొకటి మొదలైంది. కొవిడ్ కు మూల కారణమైన హానికారక వైరస్ ‘సార్స్ కోవ్ -2’ ఆనవాళ్ల మీద తరచూ ఒక కొత్త వాదన బయటకు వస్తూ ఉంటుంది. అలాంటిదే తాజాగా న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థ ఒక ఆసక్తికర ‘కథ’నాన్ని అందించింది.

ఇందులో చెప్పిందేమంటే.. వూహాన్ చేపల మార్కెట్ లో అమ్మిన రాకూన్ జాతి కుక్కల జన్యుపదార్థంలో కొవిడ్ కారక వైరస్ కనిపించినట్లుగా అంతర్జాతీయ శాస్త్రవేత్తల టీం చెప్పినట్లుగా పేర్కొంది. ఈ శాస్త్రవేత్తల మాటల ప్రకారం చూసినప్పుడు కరోనా కారక వైరస్ ప్రయోగశాలలో క్రియేట్ కాలేదని.. సహజసిద్ధంగానే ఉత్పన్నమై ఉండొచ్చన్న భావనను వ్యక్తం చేసింది. వ్యూహాన్ చేపల మార్కెట్ నుంచి కొవిడ్ వైరస్ వ్యాపించి ఉండొచ్చన్న అనుమానంతో చైనా అధికారులు 2020 జనవరిలో ఆ మార్కెట్ ను మూసేశారు. ఆ సమయంలో చైనా శాస్త్రవేత్తలు మార్కెట్ నుంచి జన్యు నమూనాలను సేకరించారు.

అప్పటికే మార్కెట్ నుంచి జంతువుల్ని తొలగించినందున.. అక్కడి ఖాళీ బోనులు.. గోడలు.. ఫ్లోరింగ్ మీద నుంచి జన్యు నమూనాలను సేకరించారు. వీటిని భద్రంగా ఉంచారు. వూహాన్ మార్కెట్ లో ఒక బండిపై పక్షుల పంజరం ఉంచగా.. మరో బోనులో రాకూన్ కుక్కలను ఉంచినట్లుగా శాస్త్రవేత్తలకు తెలిసింది. దీంతో.. ఇక్కడ శాంపిళ్లు సేకరించారు. ఒకవేళ రాకూన్ కుక్కల నుంచి మనుషులకు వ్యాపించే కన్నా.. మనుషుల నుంచి కుక్కలకు వ్యాపించి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఏమైనా.. ఇప్పటికైతే జంతువుల నుంచే మనుషులకు వైరస్ సోకి ఉండొచ్చన్న అభిప్రాయానికే మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా వూహాన్ ల్యాబ్ నుంచి కాదు.. చేపల హోల్ సేల్ మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చన్నది ఇప్పటి వాదనగా మారింది. మరి.. రానున్న రోజుల్లో మరెన్ని వాదనలు తెర మీదకు వస్తాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.