Begin typing your search above and press return to search.

సెంట్రల్‌ విస్టా పనులు ఆపడానికే ఈ కుట్ర ...సమర్ధించుకున్న కేంద్రం

By:  Tupaki Desk   |   12 May 2021 3:30 PM GMT
సెంట్రల్‌ విస్టా పనులు ఆపడానికే ఈ కుట్ర ...సమర్ధించుకున్న కేంద్రం
X
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని నిర్మిస్తున్న సెంట్రల్‌ విస్టా పనులు కొనసాగించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. సెంట్రల్‌ విస్టా పనులు నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ పై ఈ మేరకు ప్రమాణపత్రం అందజేసింది. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్ట్‌ ను ఆపడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానే ఈ పిటిషన్‌ దాఖలైందని ,దేశంలో ఎన్నో ఏజెన్సీలు నిర్మాణాలు చేపడుతుండగా ,పిటిషనర్‌ కేవలం దీన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడాన్ని బట్టి అతడి ఉద్దేశమేమిటో అర్థమవుతోందని అఫిడవిట్‌ లో పొందుపరిచింది.

దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో సహా అనేక నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఒకేసారి ఇన్ని రకాల నిర్మాణ పనులు జరుగుతున్నా పిటిషనర్‌ కేవలం ఈ ప్రాజెక్ట్‌ గురించే పిటిషన్‌ దాఖలు చేయడం వెనుక అసలు ఉద్దేశం అర్థమవుతోంది అని కేంద్రం తన అఫిడవిట్‌ లో పొందుపరిచింది. కర్ఫ్యూ సమయంలో నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ అథారిటీ అనుమతిస్తోందని , వీరంతా నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలోనే ఉంటున్నారని, పైగా కర్ఫ్యూ కంటే ముందే అక్కడకు చేరుకున్నారని తెలిపింది. కూలీలు సైతం పనులు చేసేందుకు అంగీకారం తెలిపారని, కరోనా నిబంధనలకు లోబడి పనులు జరుగుతున్నాయని ,వేరే చోటు నుంచి కూలీలను తరలిస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. కర్ఫ్యూ సమయంలో సెంట్రల్‌ విస్టా పనులను కొనసాగించడంపై అనన్య మల్హోత్రా, సోహైల్‌ హష్మీ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సమయంలో నిర్మాణ పనులు చేపడితే కూలీలు కరోనా బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నరు.