Begin typing your search above and press return to search.

పవన్ మొదలుపెట్టిన కొత్త గేమ్ ?

By:  Tupaki Desk   |   15 Oct 2021 5:30 PM GMT
పవన్ మొదలుపెట్టిన కొత్త గేమ్ ?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు వింటుంటే ఇదే అనుమానం పెరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి మీద పవన్ కు వ్యక్తిగతంగా కసి పెరిగిపోతున్న విషయం ఆయన మాటల్లోనే స్పష్టంగా తెలిసిపోతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని దెబ్బకొట్టి జనసేనను అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదల పవన్ మాటల్లో చాలా బలంగా కనబడుతోంది. మాటల్లో ఉన్న కసి కార్యాచరణలోకి వస్తుందా రాదా అనేది వేరే విషయం. మామూలుగా అయితే పవన్ నుండి కార్యాచరణను ఎవరు ఊహించేందుకు లేదు.

ఎందుకంటే పవన్ చెప్పే మాటలకు చేసే పనికి ఏమాత్రం పొంతనుండదని చాలాసార్లే నిరూపితమైంది. ఇపుడు ప్రస్తుత అంశం ఏమిటంటే పవన్ ఒక డేంజర్ గేమ్ కు తెరలేపారు. అదేమిటంటే జగన్ కు వ్యతిరేకంగా కమ్మ సామాజికవర్గాన్ని భుజానికెత్తుకోవటం. కమ్మోరంటేనే తెలుగుదేశంపార్టీ అనేంతగా ముద్రపడిపోయింది. మరిలాంటి నేపధ్యంలో కమ్మోరు టీడీపీని కాదని పవన్ వైపు ఎందుకు మొగ్గుచూపుతారు ?

నిజానికి పవన్ పదే పదే ఆరోపిస్తున్నట్లుగా వైసీపీ కమ్మోరిని వర్గశతృవుగా ఏమీ చూడటంలేదు. ఏ పార్టీకూడా మరో సామాజికవర్గాన్ని వర్గశతృవుగా చూడటమో లేకపోతే దూరంగా పెట్టడమో సాధ్యంకాదు. ఈ విషయం తెలిసినా పవన్ కావాలనే పదే పదే జగన్-కమ్మ సామాజికవర్గాలను టార్గెట్ చేస్తున్నారు. సరే పవన్ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనే విషయం భవిష్యత్తులో కానీ తేలదు. ఇంతలోనే ఒకవైపు కమ్మోరిని జగన్ కు వ్యతిరేకంగా దువ్వుతోనే మరోవైపు బీసీలను కూడా దువ్వటం మొదలుపెట్టారు.

అంటే ఏకకాలంలో ఇటు కమ్మోరిని అటు బీసీలను జగన్ కు దూరం చేయాలనే డేంజరస్ గేమ్ ను పవన్ మొదలుపెట్టారన్నమాట. దశాబ్దాలుగా టీడీపీకి మద్దతుగా నిలిచిన బీసీల్లో చీలిక వచ్చి మొదటిసారి వైసీపీకి కూడా కొన్నివర్గాలు మద్దతుగా నిలబడ్డాయి. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీసీలకు జగన్ మంచి ప్రయారిటియే ఇస్తున్నారు. దీనివల్ల రాబోయే ఎన్నికల్లో బీసీల్లో వైసీపీకి మరింత మద్దతు పెరుగుతుందని అధికారపార్టీ నేతలు భావిస్తున్నారు. మరిలాంటి సమయంలో బీసీలు జగన్ను కాదని పవన్ వెంట ఎందుకు నడుస్తారు ?

ప్రస్తుత రాజకీయాలను జాగ్రత్తగా గమనిస్తే పవన్ కు ఏ విషయంలో కూడా స్ధిరమైన అభిప్రాయం లేదనే విషయం తెలిసిపోతుంది. పవన్ ది నిలకడలేని రాజకీయమన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి పవన్ నమ్ముకున్న కమ్మ, బీసీ సామాజికవర్గాల నుండి మద్దతు ఎంతవరకు దక్కుతుందన్నది అనుమానమే. ఒకవేళ టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే ఎక్కడైనా కమ్మ-కాపు సామాజికవర్గాలు కలిస్తే కలవచ్చు అంతే కానీ బీసీలు కలిసేది అనుమానమే. ఎందుకంటే చాలా జిల్లాల్లో బీసీలు, కాపులకు చుక్కెదరున్న విషయం తెలిసిందే. మరి పవన్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సిందే.