Begin typing your search above and press return to search.

అమరావతిలో కొత్త చిచ్చు.. ఆర్5 జోన్ పేరుతో సరికొత్త నిర్ణయం

By:  Tupaki Desk   |   22 March 2023 11:13 AM GMT
అమరావతిలో కొత్త చిచ్చు.. ఆర్5 జోన్ పేరుతో సరికొత్త నిర్ణయం
X
తాను టార్గెట్ చేయాలే కానీ.. విషయాన్ని ఎంతవరకు తీసుకెళతానన్న విషయం మీద వైసీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు తన చేతలతో చేసి చూపించారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఎన్నికలకు ముందు ఒకలా.. ఎన్నికలై.. సీఎం అయ్యాక మరోలా వ్యవహరిస్తున్న ఆయన.. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని ఇన్ని కావు.

రాజధాని అమరావతిలో కొత్త కుంపట్లు పెట్టేందుకు తరచూ ఎత్తులు వేసే జగన్ సర్కారు తాజాగా అలాంటి మరో ఎత్తును తెర మీదకు తీసుకొచ్చింది. గతంలోకొన్ని ప్రయత్నాలు చేయటం.. దానిపై న్యాయపోరాటం జరగటం.. కోర్టులు సైతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ.. వాటిని కొట్టేయటం తెలిసిందే. అయినప్పటికీ తన తీరును మార్చుకోని జగన్ సర్కారు.. ఏదోలా అమరావతిలో అలజడి రేపే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకూడదన్నట్లుగా ఆయన నిర్ణయం ఉందన్న మాట వినిపిస్తోంది.

తాజాగా అమరావతిలో 'ఆర్ 5 జోన్' పేరుతో కొత్త జోన్ ను ఏర్పాటు చేశారు. ఇదెందుకు? అంటే.. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలైనా సరే.. రాజధానిలో ఇళ్ల స్థలాలు కల్పించేందుకు వీలు కల్పిస్తూ ఈ కొత్త జోన్ ను తెర మీదకు తీసుకొచ్చారు. అమరావతి చుట్టుపక్కల ఉన్న విజయవాడ.. పెద కాకాని.. దుగ్గిరాల వంటి రాజధాని వెలుపల ప్రాంతాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా తాజా జోన్ ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు.

గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. అప్పట్లో 50 వేల మందికి ఒక్కొక్కరికి ఒక్కో సెంటు (48 గజాలు) చొప్పున అమరావతిలో ఇళ్ల స్థలాల్ని పేదలకు అందించే కార్యక్రమాన్ని చేపట్టిన వేళ హైకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు.. ప్రభుత్వ నిర్ణయాన్ని కాదనేలా చేశారు. ఇందుకోసం వారు చేసిన న్యాయపోరాటానికి హైకోర్టు సైతం సానుకూలంగా స్పందించటం తెలిసిందే.

తాము తీసుకొచ్చిన జీవోను హైకోర్టును కొట్టేసిన నేపథ్యంలో.. దాని స్థానే మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసి..తాజాగా ఆర్ 5జోన్ ను తీసుకొచ్చేలా నిర్ణయాన్ని తీసుకున్నారు. అమరావతి నిర్మాణానికి తమ భూముల్ని అప్పజెప్పిన రైతులు.. తమను లబ్థిదారులుగా గుర్తించాలని కోరుకోవటం తప్పేం కాదు.

అందుకు భిన్నంగా.. భూములు ఇచ్చిన రైతుల్ని వదిలేసి.. అక్కడెక్కడో ఉన్న పేదవారికి రాజధాని అమరాతిలో వసతి కల్పించేందుకు వీలుగా కొత్త జోన్ ను తెర మీదకు తీసుకురావటం ద్వారా.. పేదలకు.. అమరావతి రైతులకు మధ్య కొత్త పంచాయితీ పెట్టేందుకు వీలుగా తాజా పరిణామం చోటు చేసుకుందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.