Begin typing your search above and press return to search.

కొత్త బ్యాంకు, కొత్త కరెన్సీ .. 'వినాయకచవితి' కి నిత్యానంద కీలక ప్రకటన !

By:  Tupaki Desk   |   13 Aug 2020 8:50 AM GMT
కొత్త బ్యాంకు, కొత్త కరెన్సీ .. వినాయకచవితి కి నిత్యానంద కీలక ప్రకటన !
X
అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉండి,అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యి ఓ వీడియో విడుదల చేశారు. వినాయక చవితి రోజు మీకు ఓ శుభవార్త చెబుతానని, కొన్ని రోజులు మీరు ఆగాలని నిత్యానంద ఆయన భక్తులకు సందేశం ఇచ్చారు. భారత్ నుండి పారిపోయ కైలాసదేశం సృష్టించుకుని ఆ దేశానికి A to Z నిత్యానంద అయ్యారని ప్రచారం జరిగింది. కొత్త దేశం అయిన కైలాస దేశానికి కొత్త చట్టాలు, కొత్త కరెన్సీ నోట్లు, కొత్త బ్యాంకులు సృష్టించుకుని వాటి వివరాలను వినాయక చవితి రోజు నిత్యానంద స్వామి విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది.

ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటి సమీపంలోని బిడిది లో నిత్యానంద స్వామికి ఓ పెద్ద ఆశ్రమం ఉంది. బిడిదిలోని ధ్యానపీఠ ఆశ్రమయంలో ఉంటున్న మహిళపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ఇప్పటికే జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. అలాగే మైనర్ అమ్మాయిలను అక్రమంగా నిర్బంధించారని స్వయంగా అమ్మాయిల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. దీనితో షాక్ అయిన నిత్యానందా .. దొంగ పాస్ పోర్ట్ తో దేశం విడిచి పారిపోయారు. నిత్యానందా కోసం గత 6 నెలలుగా పోలీసులు వెతుకుతున్నా కూడా ఆయన ఆచూకీ కనిపెట్టలేకపోయారు.

భారత్ విడిచిపారిపోయిన నిత్యానంద విదేశాల్లో ఓ ద్వీపం కొనుగోలు చేసి, దానికి కైలాసదేశం అని నామకరణం చేసినట్లు చాలా కాలం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కైలాసదేశానికి నేనే రాజు నేనే మంత్రి అంటూ నిత్యానంద కొన్ని వీడియోలు విడుదల చేశారని ఆయన భక్తులు చెప్పారు. అలాగే , ఓ ప్రముఖ బహుబాష నటి కైలాసదేశానికి ప్రధాన మంత్రి అవుతారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం ఇలా ఉన్న నేపథ్యంలోనే .. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యారు. కైలాసదేశం గురించి వినాయక చవితి రోజు తాను కీలక ప్రకటన చేయబోతున్నాని , కొన్ని రోజుల్లో మీకు మంచి శుభవార్త చెబుతానని నిత్యానంద స్వామి ఆయన భక్తులకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

కైలాసదేశానికి తాను మంచి చెయ్యాలని నిర్ణయించానని, ప్రపంచంలోనే కైలాసదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని, మంచి పనులు చెయ్యడానికి తాను కొత్త బ్యాంకులు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. కైలాసదేశంలో తాను కొత్త బ్యాంకులు, దేశీయ కరెన్సీ ఏర్పాటు చేస్తానని, కైలాసదేశానికి దేశీయ కరెన్సీని రూపొందించారని, భారీ మొత్తంలో విరాలాలు ఇవ్వడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని నిత్యానంద స్వామి వివరించారు. కైలాసదేశానికి కొత్త చట్టాలు, 300 పేజీల ఆర్థిక విధానాలు కూడా సిద్దం చేశారని, వాటి వివరాలనే నిత్యానంద స్వామి వినాయక చవితి రోజు విడుదల చేస్తారని ఆయన భక్తులు చెబుతున్నారు. అసలు వినాయక చవితి రోజు నిత్యానంద స్వామి ఆయన భక్తులను ఉద్దేశించి ఎంచెప్పబోతున్నారు అంటూ ప్రజలతో పాటు నిత్యనంద కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.