Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ కు ఊహించని దెబ్బ..టీబీజీకేఎస్ రెండు ముక్కలు

By:  Tupaki Desk   |   14 Sept 2019 9:21 PM IST
టీఆర్ ఎస్ కు ఊహించని దెబ్బ..టీబీజీకేఎస్ రెండు ముక్కలు
X
కేంద్రంలో తనకు ఎదురు లేని రీతిలో మెజారిటీని సాధించిన బీజేపీ... తమకు అంతగా కొరుకుడు పడని దక్షిణాదిపై బాగానే కాన్ సన్ ట్రేషన్ చేసినట్టుంది. అది కూడా తనకు అంతో ఇంతో కాస్తంత పట్టున్న తెలంగాణలో ఏకంగా అధికార పార్టీ టీఆర్ ఎస్ ను గద్దె దించేసి తాను ఆ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు కమలనాథులు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు ఫలితాలనే ఇస్తున్నాయని చెప్పాలి. ఈ వ్యూహాల్లో భాగంగా సింగరేణి కాలరీస్ లో టీఆర్ ఎస్ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)లో కలమం పార్టీ ఏకంగా చీలికనే తెచ్చేసింది. టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా ఉన్న కెంగర్ల మల్లయ్య ఏకంగా తన పదవికి రాజీనామా చేయడంతో పాటుగా సంఘాన్ని రెండు ముక్కలు చేసేశారు.

బయటకు మల్లయ్యకు ఏదో పార్టీలో అవమానం జరిగిన కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకుందన్న వాదనలు వినిపిస్తున్నా... లోగుట్టు మాత్రం చాలానే ఉందన్న మాట వినిపిస్తోంది. బీజేపీ అధిష్ఠానం అండతోనే మల్లయ్య తన పదవికి రాజీనామా చేయడంతో పాటుగా టీబీజీకేఎస్ ను ఒక్క దెబ్బతో రెండు ముక్కలు చేసేశారన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. సాధారణంగా తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన పార్టీగా టీఆర్ ఎస్ కు సింగరేణిలో తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే ఇప్పుడు టీబీజీకేఎస్ అధ్యక్షుడు మల్లయ్య కేంద్రంగా బీజేపీ కొట్టిన దెబ్బకు టీఆర్ ఎస్ విలవిల్లాడుతోందన్న వాదన వినిపిస్తోంది.

ఇటీవలే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తో మల్లయ్య భేటీ అయ్యారని- సింగరేణిలో టీఆర్ ఎస్ కు చావుదెబ్బ కొడితే... బంగారు భవిష్యత్తు అందిస్తామంటూ లక్ష్మణ్ చేసిన ప్రతిపాదనకు మల్లయ్య ఓకే చెప్పేశారని - ఈ క్రమంలోనే మల్లయ్య ఉన్నపళంగా టీబీజీకేఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పాటు ఆ సంఘాన్ని చీల్చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ లో మల్లయ్య చేరనున్నారని, ఆ వెంటనే వచ్చే నెలలో జరిగే సింగరేణి ఎన్నికల్లో... మల్లయ్య ద్వారా సత్తా చాటేందకు బీజేపీ పక్కా వ్యూహం రచించిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదంతా బాగానే ఉన్నా... ఉన్నపళంగా టీబీజీకేఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలను కూడా మల్లయ్య కాస్తంత వివరంగానే వెల్లడించేశారు. ఇటీవల తనకు పార్టీలోనే తీవ్ర అవమానం జరిగిందని, దీనిపై తాను పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశానని మల్లయ్య చెబుతున్నారు. అయితే తన ఫిర్యాదుపై అప్పటికప్పుడు స్పందించాల్సిన అధిష్ఠానం, కేసీఆర్... ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో పార్టీ అనుబంధ కార్మిక విభాగాన్ని గుర్తింపు కార్మిక సంఘంగా తీర్చిదిద్దిన తనకే అవమానం జరిగితే పట్టించుకోని టీఆర్ఎస్ ఇక కార్మికులను ఏం పట్టించుకుంటుందని వాదిస్తున్నారు. ఈ ఘటనల కారణంగానే తాను టీబీజీకేఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని కూడా మల్లయ్య చెబుతున్నారు. సరే మరి... కారణాలు వచ్చాయి, విశ్లేషణలు వచ్చాయి. మరి ఓ వారం పది రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం మరి.