Begin typing your search above and press return to search.

కొత్త పార్లమెంట్ ను చెక్కిన బిమల్ పటేల్ ఎవరు?

By:  Tupaki Desk   |   30 May 2023 10:05 AM GMT
కొత్త పార్లమెంట్ ను చెక్కిన బిమల్ పటేల్ ఎవరు?
X
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించే కొత్త పార్లమెంటు భవనాన్ని రికార్డు సమయంలో నిర్మించి.. ఆదివారం దాన్ని సంప్రదాయ బద్ధంగా ప్రారంభించటం తెలిసిందే. 64,500 మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త భవనాన్ని డిజైన్ చేసింది ఎవరు? ఆ అవకాశం అతనికి ఎలా దక్కింది? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర విషయాలు వెల్లడవుతాయి.

కొత్త పార్లమెంటు భవనాన్ని డిజైన్ చేసే అవకాశాన్ని గుజరాత్ కు చెందిన హెచ్ సీపీ డిజైన్స్ సంస్థ దక్కించుకుంది. దాని యజమాని బిమల్ పటేల్. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆర్కిటెక్చర్ కళను బిమల్ అందిపుచ్చుకోవటమే కాదు.. తన ప్రతిభను ఇప్పటికే నిరూపించుకున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన బిమల్ పటేల్ 1961 ఆగస్టు 31న జన్మించారు. ఆయన తండ్రి పేరు హస్ముఖ్ పటేల్. ఆయనో వాస్తు శిల్పి. 1960లో హెచ్ సీపీ డిజైన్స్ సంస్థను నెలకొల్పారు.

తండ్రికి ఏ మాత్రం తీసిపోని కొడుకుగా బిమల్ పటేల్ నిలుస్తారు. అహ్మదాబాద్ లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీలో ఆరర్కిటెక్చరల్ ఎడ్యుకేషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆయన.. అనంతరం కాలిఫోర్నియా వర్సిటీలో రీజినల్ ప్లానింగ్ లో పీహెచ్ డీ పూర్తి చేశారు.

ఆయన ప్రతిభ ఎంతన్న విషయాన్ని చూస్తే.. తాను చదివిన వర్సిటీకి 2012లో ప్రెసిడెంట్ గా బాధ్యతల్ని చేపట్టారు. ఓవైపు విద్యావేత్తగా తన సత్తాను చాటుతూనే మరోవైపు హెచ్ సీపీ సంస్థను నడిపిస్తుండటం విశేషం.

కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించే బాధ్యతను తీసుకునే ముందే.. ఆయన తన సత్తా చాటారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు తన డిజైన్ ను అందించారు. అహ్మదాబాద్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్.. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్.. పూరీలోని జగన్నాథ ఆలయ మాస్టర్ ప్లానింగ్ ను పూర్తి చేసింది ఆయన సంస్థే. తన ప్రతిభతో ఇప్పటికే ఎన్నో పురస్కారాలతో పాటు.. పద్మశ్రీను కూడా 2019లో సొంతం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. కేంద్రంలోని మోడీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా పునర్నిర్మాణ ప్రాజెక్టులో హెచ్ సీపీ డిజైన్స్ సంస్థ బిడ్ ను సొంతం చేసుకుంది. పార్లమెంట్ ను డిజైన్ చేసే బాధ్యత ఆయనకు లభించింది. దేశ ప్రజల ఆకాంక్షకు తగ్గట్లే పార్లమెంట్ ను భవనాన్ని డిజైన్ చేశారు. రైజింగ్ ఇండియాను ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దినట్లుగా బిమల్ చెబుతారు.

పాత పార్లమెంట్ భవనం వ్రత్తాకారంలో ఉంటే.. కొత్త పార్లమెంట్ భవనాన్నిమాత్రం అందుకు భిన్నంగా త్రికోణాక్రతిలో నిర్మించారు. ఎందుకు త్రికోణంలో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించారన్న విషయానికి వెళితే.. ఆసక్తికర విషయాల్ని చెప్పుకొస్తారు. దేశంలోని అన్ని సంస్క్రతుల్లో త్రిభుజాలకు ఉండే ప్రాముఖ్యతను.. ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకొని నిర్మించినట్లు చెబుతారు.

శ్రీయంత్రం.. త్రిమూర్తులు.. ఇలా ఎన్నో అంశాల్ని పరిగణలోకి తీసుకొని త్రికోణంలో నిర్మాణాన్ని చేపట్టారు. లోక్ సభ.. రాజ్యసభ.. సెంట్రల్ లాన్ ఇలా మూడు ప్రధానభాగాలుగా పార్లమెంట్ ను డిజైన్ చేశారు. మొత్తంగా దేశ చరిత్రలో నిలిచిపోయే ఒక కట్టడానికి తన అద్భుత డిజైనింగ్ ను అందించే అదృష్టం ఆయనకు దక్కిందని చెప్పక తప్పదు.