Begin typing your search above and press return to search.

జిల్లాల పేర్ల‌పై వైసీపీలోనూ ర‌భ‌స‌.. కీల‌క నేత డిమాండ్ ఇదీ!

By:  Tupaki Desk   |   26 Jan 2022 3:30 PM GMT
జిల్లాల పేర్ల‌పై వైసీపీలోనూ ర‌భ‌స‌.. కీల‌క నేత డిమాండ్ ఇదీ!
X
ఏపీలో కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న జిల్లాల‌పై అధికార పార్టీ వైసీపీలోనూ ర‌భ‌స చోటు చేసుకుంది. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌జాసంఘాలు.. కొన్ని జిల్లాల పేర్ల విష‌యంలో అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు సొంత పార్టీలోనే.. జిల్లా పేర్ల‌పై నాయ‌కులు నేరుగా అభ్యంత‌రాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. నిజానికి కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంలో రాజ‌కీయంగా.. స్థానికంగా ఉన్న‌.. ప్ర‌జ‌ల ఇష్టానికి అనుగుణంగా అడుగులు వేశామ‌ని.. ప్ర‌భుత్వం చెబుతోంది.అయితే.. అదే నిజ‌మైతే.. జిల్లాల పేర్ల నిర్ణ‌యం వెనుక‌.. ఎందుకు ర‌గ‌డ చోటు చేసుకుంద‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఉదాహ‌ర‌ణ‌కు గుంటూరు జిల్లాను మూడు జిల్లాలుగా విభ‌జించారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజ‌క‌వ‌ర్గాలు, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి నియోజ‌క‌వ‌ర్గాల‌తో గుంటూరు కేంద్రంగా గుంటూరు జిల్లా ఏర్పాటు చేయ‌నున్నారు. దీనిపై ఎలాంటి అభ్యంత‌రం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఉన్న పేరే కాబ‌ట్టి.

ఇక‌, గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల్లోని వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లుపుతూ.. బాప‌ట్ల కేంద్రంగా బాపట్ల జిల్లాను ఏర్పాటు చేస్తారు. దీనిపైనా ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. అయితే.. గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లుపుతూ.. న‌ర‌స‌రావుపేట కేంద్రంగా ప‌ల్నాడు జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ జిల్లాపైనే ఇప్పుడు అభ్యంత‌రాలు వ‌స్తున్నాయి.

నర్సరావుపేట పార్లమెంటరీ ప్రతిపాదిత కొత్త జిల్లాకు జాషువా పల్నాడు జిల్లా లేదా పల్నాడు జాషువా జిల్లా అని పెట్టాలని వైసీపీ MLC జంగా కృష్ణమూర్తి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేర‌కు సీఎం జగన్ ను కోరారు. తాజాగా జంగా మీడియాతో మాట్లాడుతూ.. న‌ర‌స‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసే జిల్లాకు మ‌హాక‌వి గుర్రం జాషువా పేరు పెట్టాల‌నే డిమాండ్ ఉంద‌న్నారు. ఈ మేరకు తన అభ్యర్థనను ఒక లేఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకు వెళ్తున్నట్లు చెప్పారు.

మహాకవి గుర్రం జాషువా తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అధ్యాయం సృష్టించార‌ని, పల్నాడు పరిధిలోని వినుకొండకు చెందిన గుర్రం జాషువా చిర‌స్మ‌ర‌ణీయంగా రాష్ట్ర చ‌రిత్ర‌లో నిలిచిపోవాలంటే.. ఆయ‌న పేరును జిల్లాకు పెట్టాల‌ని డిమాండ్ చేశారు. పద్మభూషణ్ అవార్డుతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో జాషువాను సత్కరించారని గుర్తు చేశారు. మ‌రి ఈ నేప‌థ్యంలో స‌ర్కారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.