Begin typing your search above and press return to search.

తెలంగాణ కంటే ఏపీలో కేసులు ఎంతగా తగ్గాయంటే?

By:  Tupaki Desk   |   14 Jan 2021 3:30 PM GMT
తెలంగాణ కంటే ఏపీలో కేసులు ఎంతగా తగ్గాయంటే?
X
ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే.. భారత్ లో కరోనా కేసుల నమోదు బాగా తగ్గింది. ఇదిలా ఉంటే.. దేశంలో అత్యంత ఎక్కువగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో టాప్ ఫైవ్ లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. అంతేకాదు.. తెలంగాణ కంటే ఏపీనే మెరుగైన పరిస్థితుల్లో ఉండటం గమనార్హం. ఒక దశలో ఏపీలో రోజుకు పద్నాలుగు.. పదిహేను వేల కేసుల వరకు నమోదైన స్థానే.. ఇప్పుడు కేవలం 203 కేసులు మాత్రమే నమోదు కావటం చూస్తే.. కేసుల సంఖ్య ఎంతలా తగ్గిపోయిందో ఇట్టే అర్థమవుతుంది.

అలా అని పరీక్షలు నిర్వహించటం తగ్గించారనుకుంటే తప్పులో కాలేసినట్లే. వేలాది శాంపిల్స్ ను పరీక్షిస్తున్నా.. పాజిటివ్ మాత్రం కొన్ని కేసులే కనిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో 38వేల మంది నమూనాలు సేకరించి.. పరీక్షలు జరిపితే కేవలం 331 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అదే సమయంలో ఏపీలో అంతకంటే ఎక్కువగా నమూనాలు సేకరించారు. ఏపీలో 44.6వేల నమూనాల్ని సేకరించి పరీక్షించగా 203 మందికి మాత్రమే పాజిటివ్ గా తేలింది.

కేసుల నమోదులో తెలంగాణలో ఎక్కువగా ఎప్పటిలానే హైదరాబాద్ ముందుంది. గ్రేటర్ పరిధిలో 61 కేసులు నమోదైతే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28 కేసులు.. కరీంనగర్ జిల్లాలో 25.. రంగారెడ్డిలో 21 కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో ఇరవై కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. ఇక.. ఏపీ విషయానికి వస్తే.. అత్యధిక కేసులు గుంటూరు జిల్లాలోనమోదయ్యాయి. ఈ జిల్లాలో 41 కేసులు నమోదు కాగా.. తర్వాతి స్థానంలో క్రిష్ణా జిల్లా నిలిచింది. ఇక.. నెల్లూరు.. ప్రకాశం జిల్లాల్లో రెండేసి కేసుల చొప్పున నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే.. ఒకప్పుడు కరోనా కేసులు భారీగా నమోదైన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గిందని చెప్పక తప్పదు.