Begin typing your search above and press return to search.

కొత్త కరోనా స్ట్రెయిన్ విజృంభణ .. చాలా ప్రమాదకరం , భారీగా మరణాలు పెరగొచ్చు .. బ్రిటన్ ప్రధాని !

By:  Tupaki Desk   |   23 Jan 2021 4:30 PM GMT
కొత్త కరోనా స్ట్రెయిన్ విజృంభణ .. చాలా ప్రమాదకరం , భారీగా మరణాలు పెరగొచ్చు .. బ్రిటన్ ప్రధాని !
X
కరోనా వైరస్ జోరు ప్రపంచంలో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే కరోనా కంటే, యూకేలో విజృంభిస్తోన్న కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ అత్యంత ప్రాణాంతకమంట, అత్యధిక స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యే ముప్పు పొంచి ఉందని అంటోంది బ్రిటన్ ప్రభుత్వం. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో ప్రకటించారు. గతేడాది సెప్టెంబరులో ఆగ్నేయ ఇంగ్లాండ్‌ లో తొలిసారి గుర్తించిన కొత్తరకం స్ట్రెయిన్ కారణంగా భారీ సంఖ్యలో జనం కరోనా బారిపడుతుండగా, రికార్డుస్థాయిలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని చైనా సహా మొత్తం 60 దేశాలకు ఈ స్ట్రెయిన్ విస్తరించింది.

కొత్తరకం స్ట్రెయిన్ 70 శాతం వేగంగా వ్యాప్తించెందడమే కాదు, దీని మరణాల రేటు కూడా ఎక్కువేనని కొన్ని ఆధారాలు ఉన్నాయి అని ఓ న్యూస్ కాన్ఫరెన్స్‌ లో బ్రిటన్ ప్రధాని జాన్సన్ అన్నారు. కొత్తరకం స్ట్రెయిన్ వ్యాప్తితో బ్రిటన్‌ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కొత్త వేరియంట్ ఎలా విజృంభిస్తోందో తెలియడం లేదని, అత్యంత ప్రాణాంతకమని అంటున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్ మాత్రం ఈ వేరియంట్ పై సమర్థవంతంగా పోరాడగలదని జాన్సన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గడచిన కొద్దివారాలతో పోల్చితే బ్రిటన్‌ లో కరోనా మరణాలు 16 శాతం ఎక్కువగా నమోదవుతున్నాయి. గతేడాది ఏప్రిల్ ‌లో తొలిదశ వ్యాప్తి కంటే అక్కడ పరిస్థితులు రెండింతలు దారుణంగా ఉన్నాయి. ప్రపంచంలోనే తొలిసారి టీకా పంపిణీ బ్రిటన్ ప్రారంభించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్టే అని భావించారు. కానీ, కొత్తరకం స్ట్రెయిన్ కారణంగా అంచనాలు తారుమారయ్యాయి. ఇప్పటి వరకు 5.4 మిలియన్ల మందికి కరోనా టీకా తొలి డోస్ ఇచ్చినట్టు ప్రధాని వెల్లడించారు. గడచిన 24 గంటల్లో 400,000 మందికి టీకా వేశామని అన్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న టీకాలు పాత వేరియంట్‌, కొత్త వేరియంట్‌ పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ఆధారాలన్నీ చూపుతున్నాయని తెలిపారు.