Begin typing your search above and press return to search.

కొత్త సీఎస్ గా ఆయనే... అంతా అనుకున్నదే...

By:  Tupaki Desk   |   29 Nov 2022 12:48 PM GMT
కొత్త సీఎస్ గా ఆయనే... అంతా అనుకున్నదే...
X
ఏపీకి కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ కి చెందిన జవహర్ రెడ్డి ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ అనేక కీలకమైన పదవులు చేపట్టారు. ఆయన వివిధ జిల్లాలలో కలెక్టర్ గా పనిచేశారు. ముఖ్యమైన శాఖలను కూడా ఆయన చూసారు.

టీటీడీ ఈవో గా, కరోనా టైం లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా జవహర్ రెడ్డి పనిచేశారు. ఆయన వైఎస్సార్ సీఎం అయిన టైం లో ఆయనతో కలసి పనిచేశారు. జగన్ సీఎం అయ్యాక ఆయనతో కూడా జవహర్ రెడ్డి కలసి పనిచేస్తున్నారు.

కడప జిల్లాకు చెందిన ఈ ఐఏఎస్ అధికారి వైఎస్సార్ కుటుంబానికి విధేయుడుగా ముద్ర పడ్డారు. దాంతో ఆయనకే కొత్త సీఎస్ పదవిని కట్టబెట్టారు అని అంటున్నారు. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేస్తారు.

ఆయన తరువాత చూసుకుంటే సీనియర్లు పలువురు ఉన్నారు. వారిలో పూనం మాలకొండయ్య, నీరభ్ కుమార్ ప్రసాద్, గిరిధర్, కరికాల వలవన్ ఉన్నారు. వీరితో పాటుగా చూసుకుంటే 1988 బ్యాచ్‌కు చెందిన మరో ఐఏఎస్ శ్రీలక్ష్మి పేరు కూడా ఓ దశలో వినిపించింది. ఆమెకి కచ్చితంగా ఈ పదవి దక్కుతుంది అని అనుకున్నారు. కానీ ఆఖరుకు జవహర్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపారు అని అంటున్నారు.

నిజానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నియామకంలో సీనియారిటీని మిస్ అయి ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉండేవారిని నియమించుకోవడం చాలా కాలంగా సాగుతూ వస్తోంది. అందువల్ల జవహర్ రెడ్డి నియామకం మీద ఎవరికీ ఎలాంటి ఆశ్చర్యాలూ లేవు అని అంటున్నారు. పైగా ఆయన పేరు కొన్నాళ్ళుగా నలుగుతూ వస్తోంది. ప్రచారం లో కూడా ఉంది.

ఇక జవహర్ రెడ్డి పదవీకాలం 2024 జూన్ వరకూ ఉంది. అంటే సార్వత్రిక ఎన్నికలు అయ్యేవరకూ కూడా ఆయనే సీఎస్ గా ఉంటారు అన్న మాట. ఆ విధంగా ఆయన సేవలను ఉపయోగించుకోవచ్చు అన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది అంటున్నారు. అదే టైం లో ప్రభుత్వం ఎన్నికల వేళ అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టైం లో సీఎస్ పాత్ర కూడా ముఖ్యమని అంటున్నారు.

ఇలా ఎన్నో లెక్కలు వేసుకుని మరీ జవహర్ రెడ్డి నియామకానికి పచ్చ జెండా ఊపారని అంటున్నారు. ప్రస్తుతం జగన్ కి ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శిగా జవహర్ రెడ్డి పనిచేస్తున్నారు. డిసెంబర్ ఫస్ట్ నుంచి ఆయన ఏకంగా ప్రభుత్వాన్ని నడిపే కీలకమైన పాత్రలోకి వెళ్తున్నారు. మొత్తానికి ఆయన నియామకం విషయంలో ముందు నుంచి అనుకున్నదే అయింది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.