విశాఖ స్టీల్ ప్లాంట్ కు అతడ్ని సీఎండీ చేయటమంటే.. ఇష్యూ క్లోజ్ చేయటమేనా?

Tue Sep 14 2021 15:00:05 GMT+0530 (IST)

New CMD track record for Visakha Steel

మొండితనానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే ప్రధాని మోడీ.. తమ ప్రభుత్వం ఏదైనా టార్గెట్ పెట్టుకుంటే.. దాన్ని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గేందుకు ఏ మాత్రం ఇష్టపడదు. ఇప్పటికే ఈ విషయం పలుమార్లు నిరూపితమైంది. దేశ వ్యాప్తంగా వ్యవసాయ చట్టాలకు సంబంధించి నిరసనలు చేపట్టినా.. కించిత్ కూడా వెనక్కి తగ్గకపోవటమే కాదు.. వారిని పట్టించుకోనట్లుగా వ్యవహరించటం ద్వారా తమ ప్రాధామ్యతలు ఏమిటన్నది చెప్పకనే చెప్పస్తుంటారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను వంద శాతం ప్రైవేటీకరించాలని మోడీ సర్కారు డిసైడ్ కావటం.. దానిపై వెల్లువెత్తిన నిరసనను.. ప్రజాగ్రహాన్ని పట్టించుకోకపోవటమే కాదు.. మహా అయితే ఎన్నాళ్లు ఆందోళనలు చేస్తారన్నట్లుగా వ్యవహరించిన వైనం తెలిసిందే.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేయాలని ఏపీలోని జగన్ సర్కారు ఇప్పటికే లేఖ రాయటం.. కేంద్ర విధానాల్ని వ్యతిరేకించటం తెలిసిందే. అయినప్పటికీ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా మోడీ సర్కారు తీరు ఉంది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ నూతన ఛైర్మన్ కమ్ సీఎండీగా అతుల్ భట్ ను ఎంపిక చేయటం.. ఆయన పదవీ బాధ్యతల్ని చేపట్టటం జరిగిపోయాయి. ప్రధాన మీడియా సంస్థలు.. ఈ వార్తను చాలా సింఫుల్ గా.. సింగిల్ కాలమ్ కు కుదించివేశారు.

కానీ.. ఆయన బ్యాక్ గ్రౌండ్.. ట్రాక్ రికార్డును చూస్తే.. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మోడీ సర్కారు తాను అనుకున్నది పూర్తి చేయాలన్న దానిపై ఎంత పట్టుదలతో ఉందన్న విషయం ఇట్టే తెలుస్తుంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ కు సీఎండీగా వ్యవహరిస్తున్న పీకే రథ్ మే 31న పదవీ విరమణ చేశారు. దీంతో.. ఆ స్థానికి సరైన వ్యక్తి కోసం దేశ రాజధానిలో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో అతుల్ భట్ ను ఎంపిక చేశారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2024 నవంబరు 30 వరకు ఆ బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు.

ఇప్పటికే మెకాన్ సంస్థకు సీఎండీగా అతుల్ భట్ పని చేశారు. ఇక.. అతుల్ విషయానికి వస్తే స్ట్రాటజిక్ మేనేజ్ మెంట్ ప్లాన్ 2025 రూపకల్పన చేయటంతో పాటు పలు కంపెనీల టేకోవర్.. మెర్జింగ్ లో కీలక పాత్ర పోషించారు. తాజాగా స్టీల్ ఫ్లాంట్ సీఎండీగా నియమించటం అంటే.. ప్రైవేటీకరణను వేగంగా పూర్తి చేయటం లక్ష్యమన్న సంకేతాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

డిగ్రీ పూర్తి చేసిన అతుల్ భట్ తొలినాళ్లలో టాటా స్టీల్ లో ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ సంస్థలో కొన్నేళ్లు పని చేసిన ఆయన.. మిట్టల్ కంపెనీలో జీఎంగా (యూకేలో) పని చేశారు. ఇరాన్ తో పాటు పలు దేశాల్లో పని చేసి పలు కంపెనీల మెర్జింగ్ వ్యవహారాల్లో కీలక అనుభవాన్ని సంపాదించారు. ఢిల్లీ ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయగా.. ఐఐఎం కొల్ కత్తా నుంచి పీజీ పూర్తి చేశారు. కంపెనీల విలీన వ్యవహారంలో మంచి వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. ఈ కారణంతోనే విశాఖ స్టీల్ కు అర్జెంట్ గా ఆయన్ను సీఎండీని చేశారని చెబుతున్నారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా.. తనకు అప్పజెప్పిన టాస్కును పూర్తి చేసే సత్తా ఉన్న అతుల్.. విశాఖ స్టీల్ ఇష్యూకు ‘ది ఎండ్’ కార్డు వేసినట్లేనన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి.