''జనం లేరు.. నిద్ర పోయాను.. ఏటిసేస్తాం..'' వైసీపీ ప్లీనరీపై నెటిజన్ల కామెంట్లు

Wed Jun 29 2022 15:00:02 GMT+0530 (IST)

Netizens comments on the YCP Plenary

ఏపీ అధికార పార్టీ వైసీపీ జిల్లాల్లో నిర్వహిస్తున్న ప్లీనరీలు.. చిత్ర విచిత్రాలకు వేదికగా మారుతున్నాయి. దాదాపుఎక్కడా కూడా ఈ ప్లీనరీలకు జనం వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. పైగా.. నాయకులు నోరు పారేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల డ్వాక్రా మహిళలను తరలిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల మీకు పింఛన్ రావాలంటే.. ప్లీనరీలకు రావాలని.. వృద్ధులను కూడా బెదిరిస్తున్న సంగతులు వెలుగు చూస్తున్నాయి. ఈ పరిణామాలు ఇలా ఉంటే.. తాజాగా నిర్వహించిన ప్లీనరీలో మంత్రి బొత్స సత్యనారాయణ కునుకు తీశారు.ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.  వైసీపీ ఫ్లీనరీలో మంత్రి బొత్స హాయిగా కునుకు తీశారు. ఆదమరిచి నిద్ర పోయిన మంత్రికి నిద్రాభంగం కలగకుండా నాయకులు కూడా జాగ్రత్తపడినట్లు అనిపించింది. ఇరువైపుల కూర్చున్న నేతల ప్రసంగాలు మంత్రికి జోలపాటలా అనిపించిందేమో.. హాయిగా నిద్రలోకి జారుకున్నారు.

ఏపీలో వైసీపీ ఫ్లీనరీలు నాయకులు ఫుల్.. జనం నిల్.. అన్న చందంగా మారాయి. విజయనగరం పార్వతీపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వైసీపీ ఫ్లీనరీలు జనం లేక వెలవెలబోయాయి. ఈ క్రమంలోనే సాలూరు బొబ్బిలిలో జరిగిన ఫ్లీనరీలకు మంత్రి బొత్స ఉప ముఖ్యమంత్రి రాజన్నదొరతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.

ఫ్లీనరీ ప్రారంభం నుంచి పలు సందర్భాల్లో కునుకు తీస్తున్న మంత్రి బొత్స మరోసారి నిద్రలోకి జారుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే మునుపెన్నడూ లేని విధంగా సత్తిబాబును చూసిన నేతలు ఆయనకు నిద్రాభంగం కలగనీయలేదు.

ఇక సాలూరు సభలో అయితే వచ్చిన కార్యకర్తలే తక్కువ. సభ ప్రారంభం కాగానే మూడొంతుల జనం ఇంటి ముఖం పట్టారు. ఎక్కువ శాతం ఖాళీ కుర్చీలకు నేతలు ప్రసంగాలు వినిపించాల్సి వచ్చింది. నాలుగు మండలాల నుంచి ఆశించిన స్థాయిలో కార్యకర్తలు రారనుకున్నారో.. రాలేరనుకున్నారో గానీ.. బొబ్బిలో కొద్దిపాటి హాలులో ఫ్లీనరీ జరిపించేశారు. ఫ్లీనరీ సభ నిర్వహించి మమ అనిపించారు. అయితే సారూలు సభలోనూ మంత్రి బొత్స కునుకు తీశారు.

మంత్రి నిద్రపోవడాన్ని గమనించిన నేతలు కార్యకర్తలు.. "జో సత్తిబాబన్న జోజోముకుందా.. లాలిపరమానంద జగన్ గోవిందా" అని సరదాగా పాడుకోవాల్సి వచ్చింది. మొత్తంగా ఇప్పటికే పలుసార్లు మంత్రి బొత్స నిద్రపోతూ కనబడి సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఫ్లీనరీ సమావేశంలో కునుకుతీసి బుక్ అయ్యారు. దీనిపై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. "జనం లేరు.. ఏటిసేస్తా.. నిద్రపట్టేసినాది" అని బొత్స స్టయిల్లో కామెంట్లు కుమ్మేస్తున్నారు.