Begin typing your search above and press return to search.

ప్రధాని హోదాలో ఉండి కూడా మాటలెందుకు.. చేతల్లో చూపించొచ్చుగా మోడీజీ?

By:  Tupaki Desk   |   8 April 2021 4:30 AM GMT
ప్రధాని హోదాలో ఉండి కూడా మాటలెందుకు.. చేతల్లో చూపించొచ్చుగా మోడీజీ?
X
నరేంద్ర మోడీ అలాంటి ఇలాంటి ప్రధానమంత్రి కాదు. దేశంలో ఇప్పటివరకు ప్రధానులుగా వ్యవహరించిన వారిలో నెహ్రు.. ఇందిర తర్వాత అత్యంత బలవంతమైన.. శక్తివంతమైన ప్రధాని. ఆయన అనుకోవాలే కానీ.. ఏదైనా చేసేస్తారు. అలాంటి ఆయన కూడా.. దశాబ్దాలుగా సాగుతున్న తీరుపై విచారం వ్యక్తం చేసి ఊరుకోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మిగిలిన ప్రముఖుల మాదిరి కాకుండా.. మాటల్ని వదిలి చేతల్లో చూపిస్తే బాగుంటుంది కదా? అర్థం కావట్లేదా? టైమ్లీగా వ్యవహరించటంలో మోడీకి ఉన్నంత టాలెంట్ మరెవరికీ ఉండదు.

తానెంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా.. కొన్ని అంశాలకు ఆయనిచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దేశంలోని విద్యార్థులంతా ఎంతో ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూసే పరీక్షల అంశాన్ని ప్రస్తావిస్తూ.. పరీక్షా పే చర్చ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు. కొన్ని స్ఫూర్తివంతమైన మాటల్ని చెప్పారు. అది కూడా తప్పేం కాదు.

కానీ.. దేశంలో జరిగే పరీక్షా విధానంలోని లోపాల్ని ఆయన ఎత్తి చూపారు. నేటి కాలంలో కేవలం మార్కుల ఆధారంగా విద్యార్థుల్ని అంచనా వేయటం జరుగుతోందని.. అలా చేయటం దురదృష్టకరమన్నారు. మార్కులే సర్వస్వం కాదని.. మార్కుల పరిధి దాటి చాలా ప్రపంచం ఉంటుందని.. పరీక్ష అనేది జీవితాన్ని గడపటానికి ఒక అవకాశం మాత్రమేనని వ్యాఖ్యానించారు. పరీక్ష జీవన్మరణ సమస్యగా మారినప్పుడే అసలైన ఒత్తిడి ఉంటుందన్నారు. ఈ పాయింట్ దగ్గరే మోడీ మాటలపై అభ్యంతరం వచ్చేది.

ప్రస్తుతం ఆయనున్న స్థానంలో వ్యవస్థను ప్రభావితం చేసే నిర్ణయాలతో పాటు.. ఇప్పటివరకు సాగుతున్న విధానాలకు భిన్నంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవచ్చు. అందుకు ఆయన్ను అడ్డుకునే వారెవరూ లేరు కూడా. పరీక్షల్లో మార్కుల ఆధారంగా ప్రతిభను నిర్దారించటం సరైనది కానప్పుడు.. సరైన విధానం ఏమిటో చెప్పి.. దాన్ని అనుసరించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటే.. దేశంలో మార్పు మొదలవుతుంది కదా?

మేధావులు.. బుద్ధజీవులు పలువురు మాటలు మాత్రమే చెప్పగలరు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం వారి చేతుల్లో ఉండదు. కానీ.. మోడీ అలా కాదు కదా? ఆయన అనుకుంటే వ్యవస్థలో మార్పుల్ని తీసుకొచ్చేయొచ్చు. ప్రధానిగా ఎప్పటికే ఏడేళ్ల నుంచి ఉన్నారు. మరో మూడేళ్లు ఆయనకు ఢోకా లేదు. అలాంటప్పుడు.. వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపే కన్నా.. దాని పరిష్కారం గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా? అలా ఎందుకు జరగటం లేదు? మోడీ పరిష్కారం గురించి చెప్పకుండా.. లోపాన్ని ప్రస్తావించి వదిలేయటం ఏమిటి?