పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చి మరీ రక్తదానం

Wed Feb 24 2021 05:00:01 GMT+0530 (IST)

Netizens Praises those Couple

గొప్పోళ్లు గొప్పగా ఏమీ ఉండరు. కానీ.. మన మధ్యనే సాదాసీదాగా ఉండే వారిలో  ఉండే గొప్ప మనసు.. లక్షల్లో ఒక్కళ్లలోనే ఉంటుంది. తాజా ఉదంతాన్ని చూసినప్పుడు అదే విషయం గుర్తుకు రాక మానదు. జీవితంలో పెళ్లి చేసుకునే రోజుకు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందుకోసం చాలావాటిని పక్కన పెట్టేస్తారు. అలాంటిది అందుకు భిన్నంగా.. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు పెళ్లిపీటల మీద నుంచి లేచి వచ్చి మరీ రక్తదానం ఇవ్వటం చాలా అరుదు. అలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.ఈ జంట గురించి.. వారి పెద్ద మనసు గురించి తెలిసినందనే వారి మీద గౌరవం పెరగటమే కాదు.. వారిని ఎంత పొగిడినా తక్కువే అన్నట్లుగా వారి తీరు ఉందని చెప్పాలి. ఓపక్క పెళ్లి జరుగుతున్న వేళ.. ఒక అమ్మాయికి రక్తం అవసరమైంది. దాన్ని ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఇలాంటివేళ.. రక్తం అవసరమైన అమ్మాయి కోసం.. పెళ్లి పీటల మీద నుంచి లేచి మరీ వెళ్లి రక్తం ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు యూపీ పోలీసు అధికారి అశిశ్ మిశ్రా.

ఒక యువతి ప్రాణాలు కాపాడేందుకు పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చిన కొత్త జంటలో పెళ్లి కొడుకు రక్తం ఇవ్వగా.. పెళ్లి కుమార్తె.. అతని పక్కనే నిలిచింది. ఈ ఫోటోను షేర్ చేసిన సదరు పోలీసు అధికారి ట్విటర్ లో పెట్టిన పోస్టు అందరిని ఆకర్షిస్తోంది. ‘నా భారతదేశం చాలా గొప్పది. ఒక యువతికి రక్తం అవసరమైంది. రక్తదానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే.. ఆమె వేరే వారి బిడ్డ. ఈ విషయం తెలుసుకున్న ఒక జంట బాధిత బాలికకు రక్తం ఇవ్వటానికి ముందుకు వచ్చారు. తమ పెళ్లి జరుగుతున్న విషయాన్ని పక్కన పెట్టి మరీ దానం చేశారు. వారికి బిగ్ సెల్యూట్. ఆ జంటకు దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. నిజంగానే.. వారు చేసిన పనికి హేట్సాఫ్ చెప్పటం కూడా తక్కువేనని చెప్పక తప్పదు.