వజ్రోత్సవ వేళలోనూ భారత్ కు బోస్ ఆస్థికలను తెప్పించలేమా?

Tue Aug 16 2022 10:15:52 GMT+0530 (India Standard Time)

Netaji Subhas Chandra Bose Ashes Preserved In Renkoji Temple

భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రముఖులే కాదు..సామాన్యులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున దేశ ప్రజలు పీలుస్తున్న స్వేచ్ఛా వాయువుల కోసం లక్షలాది మంది బలిదానాలు చేశారన్నది అస్సలు మర్చిపోకూడదు. దేశం కోసం పోరాడిన మహానుభావులన్నంతనే వినిపించే పేర్లలో గాంధీ.. నెహ్రూ.. పటేల్ లాంటి వారితో పాటు.. ఒక పేరును మాత్రం ఏ ఒక్కరు మిస్ కారు. ఆ పేరే.. సుభాష్ చంద్రబోస్. ఆయన కానీ బతికి ఉంటే.. మరణించకుండా ఉండి ఉంటే.. దేశానికి మరింత త్వరగా స్వాతంత్య్రం వచ్చేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానుభావుల పేర్లు చెప్పమని అడిగితే.. వాళ్లంతా మిస్ కాకుండా ప్రస్తావించే పేరు బోస్.



అలాంటి సుబాష్ చంద్రబోస్ మరణం ఒక మిస్టరీగా ఉండటం తెలిసిందే. విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్లుగా వాదనలు వినిపించే విషయం తెలిసిందే. అదే సమయంలో.. ఆయన మరణించలేదన్న మాట బలంగా వినిపిస్తూ ఉంటుంది. నేతాజీ మరణం మీద ఏర్పాటు చేసిన మూడు కమిషన్లలో రెండు ఆయన విమాన ప్రమాదంలో మరణించినట్లుగా పేర్కొంటే.. మరో కమిషన్ మాత్రం అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో.. ఎప్పటిలానే మరోసారి బోస్ మరణం మిస్టరీగా.. ఎన్నో ప్రశ్నలు తెర మీదకు వచ్చే పరిస్థితి.

ఇదిలాఉంటే.. ఆయన ఆస్థికలుగా చెబుతూ జపాన్ లోని టోక్యో రాజధాని రెంకోజీ ఆలయంలో ఉంచిన సంగతి తెలిసిందే. వీటిని ఇచ్చేందుకు ఇంతవరకు జపాన్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఈ మధ్యనే భారత దేశానికి నేతాజీ ఆస్థికలుగా చెబుతున్న వాటిని ఇచ్చేందుకు అంగీకరించింది. మరి.. అలా జపాన్ అంగీకరించిన తర్వాత ఆలస్యం చేయాల్సిన  అవసరం ఏమిటి? దేశ ప్రజలు ఇప్పటికి ఎంతగానో ఆరాధించే బోస్ ఆస్థికల్ని దేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు పాలకులకు ఉన్న ఇబ్బందేంటి? వజ్రోత్సవ వేళ.. జాతీయ జెండాను సోషల్ మీడియా ఖాతాలోనూ.. వాట్సాప్ డీపీలోనూ  పెట్టుకోవాలని దేశ ప్రజలకు టాస్కులు ఇచ్చే ప్రధాని మోడీ.. బోస్ చితాభస్మాన్ని దేశానికి తిరిగి తీసుకొచ్చి.. ఆ యోధుడి త్యాగాల్నిస్మరిస్తే ఎంత బాగుంటుంది?

వజ్రోత్సవ వేళ.. ఆ కార్యాన్ని పూర్తి చేయటంపై మోడీ ఎందుకు ఫోకస్ చేయటం లేదు? ఈ విషయాన్ని ప్రశ్నించటం..బోస్ ఆస్థికల్ని దేశానికి తిరిగి తీసుకురావటం ద్వారా.. ఆయన్ను కడసారి చూసే అవకాశం భారత ప్రజలకు లభించకున్నా.. ఆయన ఆస్థికలను దేశ ప్రజలకు దగ్గరగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. వజ్రోత్సవ వేళ.. అలాంటి పని చేస్తే మోడీ సర్కారు చరిత్రలో నిలిచిపోవటం ఖాయం.