నెల్లూరు... శత్రువుకు శత్రువు మిత్రుడు కావట్లేదే!

Mon Feb 06 2023 11:01:45 GMT+0530 (India Standard Time)

Nellore... the enemy of the enemy is not a friend!

వైసీపీ కంచుకోట అయిన నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సృష్టించిన తుపాను ఆగడం లేదు. తమ సొంత ప్రభుత్వంపై వీరిద్దరూ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తమ నియోజకవర్గాల్లో పనులకు నిధులు అందడం లేదని.. ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వైసీపీ అధిష్టానం వారిద్దరినీ వెంకటగిరి నెల్లూరు రూరల్ ఇంచార్జులుగా తప్పించి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఆదాల ప్రభాకరరెడ్డిలను ఇంచార్జులుగా నియమించింది. అంతేకాకుండా ఆనం కోటంరెడ్డిల భద్రతను సైతం తగ్గించింది.మరోవైపు ఈ సమయంలో శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు ఎంతటివారైనా వ్యవహరించడం సహజం. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణరెడ్డి ఇప్పటివరకు అలా వ్యవహరించిన దాఖలాలు కనిపించడం లేదు. ఇద్దరూ వైసీపీ నుంచి అవమానాలు ఎదుర్కొన్నారు. ఇద్దరూ ఇంచార్జి పదవులను కోల్పోయారు. వైసీపీ నేతల నుంచి తిట్లు శాపనార్థాలు విమర్శలు సరేసరి.

ఇలాంటి సమయంలో ఆనం కోటంరెడ్డి ఇద్దరూ సఖ్యతగా ఉండకపోవడంపై నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి కోటంరెడ్డి కంటే ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎప్పటికో కోటంరెడ్డి వచ్చారు.

వచ్చే ఎన్నికల్లో ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నెల్లూరు రూరల్ సీట్లు తమ కుటుంబానికి కేటాయించాలని చంద్రబాబును అడిగినట్టు టాక్ నడుస్తోంది. ఆత్మకూరు నుంచి తన కుమార్తె కైవల్యారెడ్డికి నెల్లూరు రూరల్ నుంచి తనకు టీడీపీ తరఫున సీట్లు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఆనం కుటుంబానికి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో గట్టి పట్టుంది. ఆయన ఇప్పటిదాకా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆనం సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కూడా పలుమార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు.

దీంతో ఆనం కుటుంబానికి నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ వెంకటగిరి ఆత్మకూరు నియోజకవర్గాల్లో గట్టి బలం అనుచరగణం ఉంది. అయితే ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి కోరారంటున్న నెల్లూరు రూరల్ కు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రబాబు తనకు సీటు కేటాయిస్తే వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇప్పటికే కోటంరెడ్డి ప్రకటించారు. మరోవైపు ఆనం సైతం నెల్లూరు రూరల్ కావాలంటున్నారని టాక్.

2009లో నెల్లూరు రూరల్ నుంచి ఆనం రామనారాయణరెడ్డి సోదరుడు ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 2019ల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున తాము పోటీ చేయడానికి అటు ఆనం ఇటు కోటంరెడ్డి ఇద్దరూ నెల్లూరు రూరల్ కోరుతున్నారు. దీంతో ఆనం కొంచెం వెనకడుగు వేస్తున్నట్టు చెబుతున్నారు.

ఆనం.. ఆచితూచి అడుగులేసే వ్యక్తి కాగా కోటంరెడ్డి దూకుడైన వ్యక్తి. ఈ నేపథ్యంలో టీడీపీలోకి తానొచ్చినా కోటంరెడ్డి దూకుడును తట్టుకుని టీడీపీలో ఉండగలనా అనే భావనలో ఆనం ఉన్నట్టు టాక్. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరే విషయంలో ఆనం పునరాలోచనలో పడ్డట్టు చెబుతున్నారు. బీజేపీ సైతం ఆయనకు ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన పట్ల కూడా ఆనం సుముఖంగా ఉన్నారని సమాచారం. మరికొద్ది రోజుల్లోనే ఆనం ఏ పార్టీలో చేరతారో విషయాన్ని ప్రకటించవచ్చని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.