Begin typing your search above and press return to search.

నిర్లక్ష్యం ఖరీదు... రెండేళ్ల పసిపాప ప్రాణం!

By:  Tupaki Desk   |   2 Jun 2023 5:23 PM GMT
నిర్లక్ష్యం ఖరీదు... రెండేళ్ల పసిపాప ప్రాణం!
X
రోజులు బాగాలేదు అనుకోవాలా.. జనాల కు నిర్లక్ష్యం పెరిగిపోయి ఆ నేరం రోజుల పై వేసేస్తున్నారని భావించాలా.. ప్రాణాలంటే విలువలేకుండా పోయిన రోజుల్లో ఉన్నామని అనుకోవాలో తెలియదు కానీ... తాజాగా ఒక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల పాప బలైపోయింది. కళ్లముందే కంటి పాప కన్నుమూయడంతో ఆ కుంటుంబం గుండెలవిసేలా రోదిస్తోంది. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్‌ ప్రాంతంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

ఖరీదైన కారు కదా రూల్స్‌ వర్తించవనుకున్నారో లేక.. రద్దీ గా ఉండే నడిరోడ్డు పై కారు డోర్‌ తెరిచే ముందు ఇరు వైపులా చూసుకోవాలన్న నియమాన్ని ఇంగిత జ్ఞానం లేకుండా విస్మరించాడో తెలియదు కానీ... డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు డోర్‌ తెరిచాడు. దీంతో... అదే రోడ్డు పై వస్తోన్న బైక్‌ కి హఠాత్తుగా ఓపెన్‌ చేసిన కారు డోర్‌ తగిలింది. దీంతో జరగకూడని దారుణం జరిగిపోయింది.

అవును... మన్సురాబాద్‌ నుంచి ఎల్బీ నగర్‌ రూట్‌ లో.. కారు డ్రైవర్‌ రోడ్డులో కారు ఆపాడు. ఓ వ్యక్తి దిగి వెళ్లిపోగా.. డ్రైవర్‌ సీట్‌ లో ఉన్న వ్యక్తి హఠాత్తుగా కారు డోర్‌ తీశాడు. ఆ సమయంలో పక్క నుంచి వెళ్తున్న బైకు కారు డోర్‌ కు తగిలింది. దీంతో ఆ బైక్‌ పై ఉన్న కుటుంబ సభ్యులు కిందపడిపోయారు. దీంతో రెండేళ్ల వయసున్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన చిన్నారిని ధనలక్ష్మి(2)గా గుర్తించారు పోలీసులు.

ఈ సందర్భంలో డోర్‌ తగిలి రోడ్డు పైన నెత్తుటి మడుగులో పడి ఉన్న పసిపిల్లను, స్పృహ కోల్పోయిన చిన్నారి తల్లిని కాపాడే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. ఫలితంగా "మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు..." అనే పదాలను గుర్తుకు తెస్తుంది. 15 నిముషాల పాటు నెత్తుటి మడుగులో పడిఉన్న తల్లీ బిడ్డల ను తీసుకెళ్ళేందుకు ఎవ్వరూ సాయపడలేదు.

కాసేపటికి పాప తండ్రి సయ్యద్‌.. చిన్నారి నీ, ఆమె తల్లి శశిరేఖనీ కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పసి పాప మృత్యువడికి చేరుకుంది. సయ్యద్‌ ఫిర్యాదు తో డ్రైవర్‌ పై 304 (ఆ), 337 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన వారిని ఈ విషాద సంఘటన కలిచివేస్తుంది!