Begin typing your search above and press return to search.

వామ్మో లక్షల జీతాలా... నెగిటివ్ టాక్ ... ?

By:  Tupaki Desk   |   20 Jan 2022 11:30 AM GMT
వామ్మో లక్షల జీతాలా... నెగిటివ్ టాక్ ... ?
X
మంచికో చెడ్డకో కానీ లాంగ్ లాంగ్ ఎగో అన్నట్లుగా ఉద్యోగులు ఇపుడు మళ్లీ రోడ్డెక్కారు. అప్పట్లో అంటే ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం ఎన్టీయార్ సీఎం గా ఉండగా కూడా ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. సమ్మెకు కూడా దిగి ఎక్కువ రోజులే పొరాటం చేశారు. మళ్ళీ ఆ తరువాత ఉద్యోగులకు ఎపుడూ ఇలాంటి సీన్ రాలేదు. తరువాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా వారిని బాగానే చూసుకున్నాయి. మళ్లీ ఇన్నాళ్ళకు ఉద్యోగులతో ఢీ కొట్టే సీఎం గా జగన్ నిలిచారు.

జగన్ ఉద్యోగుల డిమాండ్ల విషయంలో తాను చేయాల్సింది చేశారు, ఇక ఇంతే అని కూడా చెప్పకనే చెబుతున్నారు. దాంతో ఉద్యోగులకు సీన్ కళ్ల ముందు కనిపిస్తోంది. ఇది సుదీర్ఘమైన పోరాటమని కూడా వారికి అర్ధమవుతోంది. అందుకే వారు సమ్మెకు పూర్తిగా ప్రిపేర్ అవుతున్నారు అనుకోవాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలకు కలిస్తే మహా సముద్రాన్నే తలపించినట్లుగా అన్ని కలెక్టరేట్లు నిండిపోయాయి. ఎటు చూసినా ఉద్యోగ జనంతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

అస‌లు ఏపీలో కరోనా ఉందా అన్న అనుమానం కలిగేలా ఇసుక వేస్తే రాలనంతగా జనాలు వచ్చారు. మొత్తానికి తమకు న్యాయం చేయలాంటూ ఉద్యోగులు గట్టిగా నినదిస్తూంటే ఈ సమస్య కాస్తా ఇపుడు సగటు జనాలకు చేరింది. అంతే కాదు, వారి పోరాటాన్ని ప్రముఖ్య పత్రికలు బ్యానర్ ఐటెమ్స్ గా వేయడంతో వార్తలు కూడా అందరూ చదువుతున్నారు. ఈ విధంగా ఉద్యోగులకు ఎంత జీతాలు వస్తున్నాయి. ఎంత పెంచారు, ఇంకా ఎంత కావాలంటున్నారు అనంది అయితే జన బాహుళ్యంలో పెద్ద ఎత్తున చర్చగా ఉంది.

ఇపుడున్న పీయార్సీ ప్రకారం చూస్తే జూనియర్ లెవెల్ ఉద్యోగులకు జీతాలు వేలల్లోనే వస్తున్నాయి. కాస్తా సీనియర్లు అయితే లక్షల్లో జీతాలు అందుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున జీతాలు పుచ్చుకుంటున్నారు కదా ఇంకా ఏం తక్కువైంది వీళ్ళకు అన్నదే ఇపుడు జనంలో వినిపిస్తున్న మాట. నిజానికి అందరి మీద కాదు కానీ చాలా ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగుల మీద అయితే జనాలకు సదభిప్రాయం లేదు అంటారు. అదే విధంగా ఉపాధ్యాయులు సైతం సర్కార్ బళ్లలో ఎక్కువ మంది చదువులు సరిగ్గా చెప్పడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి.

వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పించకుండా ప్రైవేట్ బాట పట్టిస్తారని కూడా గుస్సా ఉంది. మరో వైపు చూసుకుంటే ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా తమ పనులు సరిగ్గా చేయకుండా ఉద్యోగులు ముప్పతిప్పలు పెడతారు అని కూడా జనాల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులు జీతాలు చాలడం లేదు అంటూ రొడ్డెక్కడం పట్ల సామాన్యుల్లో అయితే నెగిటివ్ గానే టాక్ వస్తోంది అంటున్నారు.

కరోనాతో అన్ని రంగాలు కునారిల్లిపోతూంటే లక్షలలో జీతాలు తీసుకుంటూ ఇంకా చాలదు అనడమేంటి అన్న చర్చ కూడా మొదలవుతోందిట. మరో వైపు చూస్తే బడ్జెట్ లో ఎక్కువ శాతం నిధులు ఉద్యోగుల జీతాలకు వెళ్ళిపోతే ఇక అభివృద్ధి ఎలా సాధ్యం అన్న చర్చ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఉద్యోగుల పోరాటానికి సామాన్య జనాల నుంచి మాత్రం అంతగా మద్దతు దక్కడంలేదు అనే చెప్పాలి. రేపటి రోజున సమ్మె గట్టిగా చేసినా కూడా మరింత వ్య‌తిరేకత కూడా మూటకట్టుకుంటారు అన్న మాట కూడా వినిపిస్తోంది.

ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఎంతసేపూ జీతాలు పెంచమంటారు కానీ తాము కరెక్ట్ గా పనిచేస్తామని, టైం కి ప్రజలకు సేవ చేస్తామని ఎవరూ చెప్పరేమని కూడా జనాల నుంచి వస్తున్న అతి పెద్ద ప్రశ్న. మరి హక్కులు వరకేనా బాధ్యతలు గురించి మాట్లాడరా అన్న దానికి జవాబు ఎవరు చెప్పాలో.