Begin typing your search above and press return to search.

మహిళా రెజ్లర్లకు సపోర్టుగా నక్సల్స్... ఏం చేశారంటే?

By:  Tupaki Desk   |   2 Jun 2023 2:18 PM GMT
మహిళా రెజ్లర్లకు సపోర్టుగా నక్సల్స్... ఏం చేశారంటే?
X
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయంశం అవుతోంది. ఆయనకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు నిరసనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఛత్తీస్‌ గఢ్‌ లోని కంకేర్‌ లో నక్సల్స్ బ్యానర్లను ఏర్పాటు చేశారు. బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్‌ ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జనక్‌ పూర్ నుంచి ఛోటేబెథియా రహదారిపై బ్యానర్‌ ను ప్రదర్శించారు నక్సల్స్.

కేంద్రం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పఢావో ప్రచారాన్ని నక్సల్స్ కేవలం డ్రామాగా పేర్కొన్నారు. కేంద్ర సర్కార్ పై విమర్శలు గుప్పించారు నక్సల్స్. బండే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో పార్తాపూర్ ఏరియా కమిటీ బ్యానర్‌ ను ఏర్పాటు చేశారు.

గత వారం న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ నిరసన స్థలం నుంచి లాగి, తొలగించబడిన భారత అగ్రశ్రేణి రెజ్లర్లకు నక్సల్స్ సపోర్ట్ గా నిలిచారు. వెంటనే బ్రిజ్ భూషణ్ సింగ్‌ పై చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి ఐదు రోజుల అల్టి మేటం ఇచ్చారు రెజ్లర్లు.

రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సంగీతా ఫోగట్ బజరంగ్ పునియా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌ కి వ్యతిరేకంగా నిరసనలలో ముందంజలో ఉన్నారు. నక్సల్స్ రెజ్లర్లకు మద్దతు ఇవ్వడంతో ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపుతుంది.

అయితే బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ అయి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వారి ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు 2 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అంతే కాకుండా 10 ఫిర్యాదులు దాఖలు చేశారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసులో నమోదు అయ్యాయి.

రెండు ఎఫ్ఐఆర్‌ల ప్రకారం, డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ లైంగిక ప్రయోజనాలను డిమాండ్ చేశారని ఆరోపించారు. ఇంకా, బ్రిజ్ భూషణ్ సింగ్‌పై కనీసం 10 వేధింపుల ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. అయితే ఈ ఆరోపణలను బ్రిజ్‌భూషణ్‌ ఖండిస్తూనే ఉన్నారు. రెజ్లర్లు చేసిన ఆరోపణలు నిజమని తేలితే తాను ఉరేసుకోడానికైనా సిద్ధమేనని చెప్పుకోచ్చారు.