Begin typing your search above and press return to search.

పెర్సెవ‌రెన్స్ రోవ‌ర్‌.. పెర్ఫార్మెన్స్ కేక‌.. ఫొటోలో, వీడియోలు రిలీజ్ చేసిన నాసా!

By:  Tupaki Desk   |   23 Feb 2021 4:39 AM GMT
పెర్సెవ‌రెన్స్ రోవ‌ర్‌.. పెర్ఫార్మెన్స్ కేక‌.. ఫొటోలో, వీడియోలు రిలీజ్ చేసిన నాసా!
X
మార్స్ ప్లానెట్ పై ప‌రిశోధ‌న‌ల కోసం అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ నాసా సంధించిన రోవ‌ర్ ‘పెర్సెవరెన్స్’. గత శుక్రవారం దిగ్విజయంగా అంగారక గ్రహంపై ల్యాండ్ అయిన ఈ రోవర్.. దిగీదిగగానే తన పని మొదలు పెట్టేసింది. ఈ అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియోను నాసా విడుదల చేసింది. రోవర్ కు బిగించిన కెమెరాలు, మైకులు చక్కగా పనిచేయడంతో.. మార్స్ పై రోవర్ దిగుతున్న వీడియోలతోపాటు.. ఆ సమయంలో ఉద్భవించిన శబ్ధాలు కూడా చక్కగా క్యాప్చర్ అయ్యాయి.

రోవ‌ర్ లో మొత్తం రెండు మైక్రోఫోన్లు, 25 కెమెరాలు ఉన్నాయన్నాయి. అయితే.. ల్యాండింగ్ స‌మ‌యంలో 7 కెమెరాల‌ను ఆన్ చేసిన‌ట్లు నాసా శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. భవిష్యత్తులో మరిన్ని వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తామని నాసా సైన్స్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ చెప్పారు. ‘‘రోవర్‌లోని మైక్రోఫోన్ మార్స్ నుండి వచ్చే శబ్దాలను ఆడియో రికార్డింగ్‌ను అందించింది. ఇలాంటి శబ్దాలను, వీడియోను సాధించడం ఇదే మొదటిసారి..ఇవి నిజంగా అద్భుతమైన వీడియోలు" అని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ డైరెక్టర్ మైఖేల్ వాట్కిన్స్ ప్రకటించారు.

నాసా విడుద‌ల చేసిన వీడియోలో.. రోవ‌ర్ అరుణ గ్ర‌హంపై ల్యాండింగ్ అవుతున్న దృశ్యాలు ఉన్నాయి. రోవర్ ల్యాండ్ కావడానికి ముందు పారాచూట్ విచ్చుకోవడంతోపాటు, పెర్సెవ‌రెన్స్ కిందకు దిగుతున్న దృశ్యాలు, మార్స్ ఉప‌రిత‌లం కూడా ఈ వీడియోలో క‌నిపించింది. ‘‘మొత్తం మూడు నిమిషాల 25 సెకన్ల పాటు కొనసాగే హై-డెఫినిషన్ వీడియో క్లిప్‌ను సాధించాం’’ అని నాసా ఇంజినీర్లు ప్రకటించారు. మార్స్ ఉపరితలం వీడియోలో చక్కగా కనిపించింది. గ్రహానికి రోవర్ దగ్గరవుతున్న కొద్దీ.. మార్స్ నేల మరింత స్పష్టంగా కనిపించింది. అక్కడి భూమి మొత్తం ఎర్రగా ఉంది.