Begin typing your search above and press return to search.

రూ.50వేల కోట్లతో మోడీ కొత్త పథకం!

By:  Tupaki Desk   |   18 Jun 2020 1:30 PM GMT
రూ.50వేల కోట్లతో మోడీ కొత్త పథకం!
X
20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా కరోనా లాక్ డౌన్ వేళ రూపాయి లాభం చేకూర్చలేదని అటు స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఇటు ఆర్థిక రంగ నిపుణులు, ప్రజలు ఈసడించారు. ఈ క్లిష్ట కరోనా వేళ కేంద్రంలోని మోడీ సర్కార్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. జూన్ 20న గరీబ్ కళ్యాణ్ రోజ్ గర్ అభియాన్ స్కీమ్ ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారని తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన నిర్మల.. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువస్తున్నామని ఆమె తెలిపారు. గ్రామీణులకు, వలస కార్మికులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. 6 రాష్ట్రాల్లో 116 జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. దాదాపు 25 పథకాల సేవలను ఒకే చోటు నుంచి అందిస్తామని వివరించారు. 125 రోజుల పాటు ఈ కొత్త పథకం అందుబాటులో ఉంటుందన్నారు. దీనికోసం 50వేల కోట్లు వెచ్చిస్తున్నారు.

అయితే ఈ భారీ పథకంలో తెలంగాణ - ఏపీలకు చోటు దక్కకపోవడం నిరాశగా మారింది. ప్రస్తుతం ఈ 50వేల కోట్ల పథకం బీహార్ - ఉత్తరప్రదేశ్ - మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - జార్ఖండ్ - ఒడిశాలలో అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. వచ్చే 4 నెలల పాటు గ్రామస్థులకు ఉపాధి కల్పిస్తామన్నారు. తర్వాత ఎవరి పనులకు వారు వెళ్లిపోవచ్చని సూచించారు. వలస కార్మికులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. బీహార్ లోని తెలిహర్ గ్రామంలో ఈ పథకం ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు.