Begin typing your search above and press return to search.

2014 దాకా ఎందుకు? మన మంత్రుల మాటేమిటి మోడీజీ?

By:  Tupaki Desk   |   9 Aug 2020 11:30 AM GMT
2014 దాకా ఎందుకు? మన మంత్రుల మాటేమిటి మోడీజీ?
X
దేశ ప్రధాని మోడీకున్న నైపుణ్యాల గురించి అందరికి తెలిసిందే. ఏ విషయంలో ఎప్పుడు ఎలా రియాక్టు కావాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో? రాజకీయ నేతలు అన్నాక ప్రత్యర్థుల్ని ఉతికి ఆరేసేలా విమర్శలు చేయటం మామూలే. అందుకు ప్రజలు సైతం ఎలాంటి అభ్యంతరం రాదు. కానీ.. తమను తాము కీర్తించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు ఇష్టపడరు. కానీ.. అలాంటి విషయంలోనూ తనకున్న టాలెంట్ ఎంతన్నది మోడీ తన మాటలతో ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్నారు కూడా.

తాజాగా అదే తీరును ప్రదర్శించారు మోడీ. తమ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ కారణంగా కోవిడ్ 19 మీద సమర్థవంతంగా పోరాటం చేయగలిగినట్లు పేర్కొన్నారు. 2014కు ముందు కోవిడ్ వచ్చిందని ఊహించుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో అన్నారు. 60 శాతం మంది కనీసం ఇళ్లలో మరుగుదొడ్లు లేక బహిరంగ విసర్జనకే పరిమితమయ్యేవారని.. అలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించటం అసాధ్యమయ్యేదని నాటి కాంగ్రెస్ పాలనపై చురకలు వేసే ప్రయత్నం చేశారు.

తమ పాలనలో 60 నెలల్లో 60 కోట్ల మందికి టాయెలెట్ సౌకర్యాన్ని కలుగుజేసినట్లుగా చెప్పుకున్న మోడీ మాటల్నే తీసుకుంటే.. అంత విజన్ ఉన్న ప్రధాని కోట్లాది మంది వలస కార్మికుల్ని వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ ఊళ్లు వెళ్లే దౌర్భాగ్యం ఎందుకు కలుగజేసినట్లు? తాము చేసిన పనిని గొప్పగా చెప్పుకుంటున్న మోడీ.. దేశంలో కరోనా కేసులు 20 లక్షలు ఎలా చేరుకున్నాయి? అంత సమర్థతమే ఉండి ఉంటే.. ఇంత భారీగా ఎందుకు నమోదు అవుతున్నట్లు? ప్రపంచ వ్యాప్తంగా రోజులో అత్యధిక కేసులు నమోదయ్యే దేశంగా అరుదైన రికార్డును సొంతం చేసుకోవటానికి మరో వారం కంటే ఎక్కువ సమయం పట్టదేమో?

తాము చేపట్టిన కార్యక్రమాల వల్లే కోవిడ్ వ్యాప్తి నిరోధించినట్లుగా చెబుతున్న మోడీ.. ప్రజల దాకా ఎందుకు.. తనకు అత్యంత సన్నిహితుడైన అమిత్ షాకు రాకుండా ఏం చేయగలిగారు? తన మంత్రివర్గంలోని మంత్రులకు కరోనా రాకుండా ఎందుకు నిరోధించలేకపోయారు. తన వైఫల్యాల్ని వేలెత్తి చూపించటానికి ముందే..విపక్ష కాంగ్రెస్ మీద మాటల దాడి చేస్తున్న తీరు చూస్తే.. మోడీ టాలెంట్ ను మెచ్చుకోకుండా ఉండలేం బాస్.