ఆమె హిట్లర్ సోదరి..గవర్నర్ పై సీఎం నిప్పులు!

Wed Nov 20 2019 19:32:24 GMT+0530 (IST)

ఉప్పూ-నిప్పులా ఉండే పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ - ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి మధ్య మరోమారు మాటల యుద్ధం జరిగింది. గవర్నర్ వ్యవహార శైలిపై తీవ్రంగా విభేదిస్తున్న ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈ దఫా సంచలన వ్యాఖ్యలు చేశారు.జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ సోదరిగా కిరణ్ బేడీ కనిపిస్తోందని నారాయణస్వామి అన్నారు. ఆమెపై ప్రత్యక్ష దాడికి దిగారు. ప్రజలు ఎన్నుకున్న అధికారపార్టీ ప్రవేశపెట్టే పథకాలను అడ్డుకోవాలన్న ధ్యేయంతో కిరణ్‌బేడీ వ్యవహరిస్తున్నారని ఆమె తీరు హిట్లర్ లా ఉందని మండిపడ్డారు మంత్రివర్గ నిర్ణయాలను కిరణ్ బేడీ తోసిపుచ్చినప్పుడల్లా తన బ్లడ్ ప్రెషర్ అధికమవుతుంటుందని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.జీవానందం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటైన జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను మంగళవారం ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుంటుందని  ఆరోపించారు. డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి విగ్రహం ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించామని - ఇందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశామని పేర్కొంటూ...ఈ విషయంలో గవర్నర్ కిరణ్ బేడీ జోక్యం చేసుకుని ప్రభుత్వ స్థలంలో కరుణ విగ్రహ ఏర్పాటుకు అనుమతించబోమని చెప్పడం ఆవేదనకు గురిచేసిందని నారాయణ స్వామి అన్నారు. ప్రజలకు ఎనలేని సేవలు చేసి - ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టిన కరుణానిధి కీర్తిప్రతిష్టలను విస్తరింపచేసేందుకు పుదుచ్చేరిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడంలో తప్పేముందని నారాయణస్వామి ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించేవారు ప్రభుత్వ అధికారులైనప్పటికీ త్వరలో జైలుకు వెళతారని పరోక్షంగా కిరణ్ బేడీని హెచ్చరించారు.