Begin typing your search above and press return to search.

మళ్లీ లోకేష్ దిగాల్సిందేనా... ?

By:  Tupaki Desk   |   17 Jan 2022 4:00 PM GMT
మళ్లీ లోకేష్ దిగాల్సిందేనా... ?
X
చినబాబు ఇప్పటిదాకా ఏపీలో ఏమైనా ప్రజా పోరాటాలు చేశారా అని వైసీపీ పెద్దలు నిగ్గదీయవచ్చు. కానీ ఆయన చాలానే పోరాటాలు చేశారు. వాటిలో సక్సెస్ కూడా అయ్యారు. అదే రెండవ విడత కరోనా వేళ పదవతరగతి పరీక్షలు నిర్వహించకుండా ఆయన కనుక అడ్డుపడకపోతే ప్రభుత్వం దూకుడు ఆపవశమా అని అంతా అనుకున్నారు నాడు. ఇక అప్పట్లో కూడా విద్యా సంస్థలను తెరచారు. అయితే కరోనాతో ఎలా స్కూళ్ళు తీస్తారు అని లోకేష్ తగులుకుంటేనే మొత్తానికి మూత పడ్డాయి.

ఇపుడు కూడా వైసీపీ సర్కార్ మళ్లీ అదే రూట్ లో వెళ్తోంది అంటున్నారు. ఒక వైపు కరోనా మూడవ దశ ఏపీని చుట్టుముడుతోంది. టాప్ టెన్ స్టేట్స్ లో ఏపీ ఎనిమిదవ‌ ప్లేస్ లో ఉంది. ఆ తరువాత స్థానంలో ఉన్న తెలంగాణాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరి ఏపీ ఎందుకు ఆ పని చేయదు అని అంటున్నారు అంతా.

ఇపుడు ఉన్న కరోనా స్పీడ్ చాలా దారుణమని నిపుణులే చెబుతున్నారు. గంటల వ్యవధిలోనే ఒకరి నుంచి మరొకరికి అది వ్యాపిస్తోంది. ఈ నేపధ్యంలో స్కూళ్ళలో గంటల తరబడి ఉంచితే వారికే కాదు తల్లిదండ్రులకు కూడా అది అంటుకుంటుందని, ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటే వారికి కూడా ఇబ్బందే అంటున్నారు.

అయినా సరే కరోనా వ్యాప్తికి విద్యా సంస్థల తెరవడానికి అసలు సంబంధం లేదు అని మంత్రి సురేష్ చెబుతున్నారు. కరోనా ఏపీలో అదుపులో ఉందని కూడా ఆయన అంటున్నారు. ఒక స్కూల్ లో కరోనా వస్తే శానిటైజ్ చేయిస్తామని కూడా చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులలో ఆందోళన పెరిగిపోతోంది.

లోకేష్ మళ్లీ సీన్ లోకి రావాల్సిందే అంటున్నారు. చినబాబు ఇప్పటికే లేఖ రాశారు. జగన్ గారూ పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కూడా విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. ఏపీలో కూడా అదే పని చేయండి అంటూ ఆయన గట్టిగానే డిమాండ్ చేశారు. దేశంలో పదకొండు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూతపడితే ఏపీలో మాత్రం విద్యార్ధుల భవిష్యత్తు అంటున్నారు మంత్రి గారు.

దీంతో తల్లిదండ్రులతో పాటు అందరికీ టెన్షన్ పట్టుకుంది. లోకేష్ మరోసారి దీని మీద పోరాటం చేస్తేనే సర్కార్ దిగి వస్తుందని వారు అంటున్నారు. మొత్తానికి చినబాబు ఈ విషయంలో సక్సెస్ అవుతారనే అంతా భావిస్తున్నారు. మరి అంత వరకూ సీన్ తెచ్చుకోకుండా ప్రభుత్వమే దీని మీద కీలక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్న సూచనలు అందుతున్నాయట. చూడాలి మరి ఏం జరుగుతుందో.