Begin typing your search above and press return to search.

అదే వీడియో పోస్టు చేస్తున్నా.. ఏం చేస్తారో చేయండంటూ లోకేశ్ సవాల్

By:  Tupaki Desk   |   17 Feb 2020 5:10 AM GMT
అదే వీడియో పోస్టు చేస్తున్నా.. ఏం చేస్తారో చేయండంటూ లోకేశ్ సవాల్
X
సోషల్ మీడియా పరిధి అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. ఇప్పుడు రాజకీయం దాని చుట్టూ తిరుగుతోంది. తాను అనుకున్నంతనే తమ భావాల్ని.. అభిప్రాయాల్ని పంచుకునేందుకు వేదికగా మారిన సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద అంశాలు పోస్టు చేయటం.. అవి కాస్తా వైరల్ గా మారటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఉదంతాలపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.

ఇదిలా ఉంటే కడప జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త విజయ్ కుమార్ రెడ్డి అనే యువకుడు ఒక వీడియోను పోస్టు చేశాడు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో బడుగు.. బలహీన వర్గాల వారికి జగన్ అన్యాయం చేస్తున్నట్లుగా ఆరోపించారు. సీఎం సొంత జిల్లాకు చెందిన ఒక యువకుడు జగన్ పై విమర్శలు చేస్తూ పోస్టు చేసిన వీడియో వైరల్ గా మారింది. అయితే.. సదరు వీడియో పోస్టు చేసిన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. మీడియా ముందుకు ముసుగు వేసి హాజరు పర్చటం మరింత చర్చకు తెర తీశాయి.

ముసుగు వేసి మరీ మీడియా ముందు ప్రవేశ పెట్టేంత తీవ్రమైన తప్పు ఏం చేశారంటూ ప్రశ్నించారు లోకేశ్. జగన్ దగ్గర మార్కుల కోసం అధికారులు కొందరు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేసిన కోర్టుల చేత చివాట్లు తినొద్దన్న సూచన చేశారు. విజయ కుమార్ రెడ్డి ఏ వీడియో అయితే పోస్టు చేశాడో.. తానుకూడా అదే వీడియో పోస్టు చేస్తానని.. తననేం చేస్తారో చేసుకోండంటూ సవాలు విసిరారు. విజయ్ కు తాము దన్నుగా నిలుస్తామన్న లోకేశ్.. సదరు యువకుడి అక్రమ అరెస్టును తప్పు పడుతూ వరుస పోస్టులు పెట్టారు. మరి.. చినబాబు సవాలుకు ఏపీ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో?