నారా లోకేష్ పాదాలకు బొబ్బలు.. డాక్టర్లు ఏమన్నారంటే!

Fri Mar 31 2023 19:08:16 GMT+0530 (India Standard Time)

Nara Lokesh Padayatra Sri Sathyasai District

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన ఈ పాదయాత్ర 56వ రోజుకి చేరుకుంది. పాదయాత్రలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు చిన్నారులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అభిమానాన్ని చాటుకుంటున్నారు.  అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటన్నింటినీ అధిగమించి పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.  



శ్రీ సత్యసాయి జిల్లాలోని సీకే పల్లిలో నారా లోకేష్కు ప్రజలు.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా లోకేష్కు పులమాలలు హారతులతో జనం నీరాజనాలు పలికారు. లోకేష్ని చూసేందుకు.. మాట్లాడేందుకు మహిళలు వృద్దులు పెద్ద ఎత్తున తరలి రావడం గమనార్హం.

లోకేష్ ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకున్నారు.  టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పన్నుల భారం నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని వారికి హామీ ఇచ్చారు.  

ఇదిలావుంటే యువగళం పాదయాత్రలో లోకేష్ ఎక్కడా ఆగకుండా నిర్విరామంగా నడవడం వల్ల కాళ్లకు బొబ్బలు వచ్చాయి. బొబ్బలు తగ్గే వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించినా.. పాదయాత్ర ఆపడం కుదరదని.. కొనసాగించేందుకే లోకేష్ మొగ్గు చూపారు.

బొబ్బలతోనే పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రోజుకు సగటున 15 కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. పాదయాత్ర ముగిసిన తర్వాత.. ప్రత్యేక లోషన్లు రాసుకోవాలని వైద్యులు సూచించారు. అదేవిధంగా పాదయాత్రకు వినియోగిస్తున్న షూస్ మార్చాలని కూడా సూచించారు.

రహస్యంగా కలుస్తున్న ఉద్యోగులు

యువగళం పాదయాత్రలో భాగంగా చేపడుతున్న సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. లోకేష్తో ఫొటో దిగి దానిని యువత సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుండటంతో.. ప్రతి రోజూ వీక్షకుల సంఖ్య 5 లక్షలపైనే ఉంటోదని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు లోకేష్ను రహస్యంగా కలిసి సమస్యలు చెప్పుకునే వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.