Begin typing your search above and press return to search.

జగన్ ట్రాప్ లో పడి కెరీర్ నాశనం చేసుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   25 Sep 2022 4:20 AM GMT
జగన్ ట్రాప్ లో పడి కెరీర్ నాశనం చేసుకుంటున్నారా?
X
'పప్పు'.. 'పప్పు' అంటూ అదే పనిగా ట్వీట్ చేస్తూ.. లేని పప్పును కాస్తా నిజమే.. పప్పు అనేలా చేసిన ఘనత జగన్ అండ్ కోకు దక్కుతుంది. అదే సమయంలో తనపై చేస్తున్న దాడిని తిప్పి కొట్టే విషయంలో అప్పట్లో అధికారంలో ఉన్న లోకేశ్ కూడా సీరియస్ గా తీసుకోలేదు. అదే ఆయన పాలిట పెద్ద శాపంగా మారింది. ఏళ్ల తరబడి సాగించిన ప్రచారంతో ఆయన ఇమేజ్ కాస్తా పప్పు పేరుతో ఫిక్సు అయ్యే పరిస్థితి. ఆ ముద్రల్నిచెరిపేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.

ఎట్టకేలకు తనదైన మేకోవర్ తో మారిన మనిషిగా లోకేశ్ తనను తాను ఫ్రూవ్ చేసుకునేందుకు చాలానే కష్టపడ్డారని చెప్పాలి. జగన్ అండ్ కో పుణ్యమా అని లోకేశ్ డిక్షన్ మాత్రమే కాదు.. ఆయన మైండ్ సెట్ డిక్షనరీ సైతం మారిపోయిందంటున్నారు. గతంలో ఆయన నోటి నుంచి వినిపించని ప్రతీకారం.. ఇటీవల కాలంలో డైలీ బేసిస్ లో వినిపిస్తోంది. తన చేతిలో అధికారంలో ఉన్నప్పుడు తాను ఏ పనులు చేయటాన్ని తప్పుగా భావించారో.. ఇప్పుడు అవే పనులు చేస్తున్న జగన్ కారణంగా తన కెరీర్ తోపాటు.. తన పార్టీ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితుల్లో.. కొత్త తరహాలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నట్లుగా ఆయన ఫిక్సు అయినట్లుగా లోకేశ్ సన్నిహితులు చెబుతుంటారు.

దీనికి తగ్గట్లే.. ఆయన మాట తీరులోనూ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందంటున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్లు ఇదే విషయాన్ని చెబుతున్నాయని చెప్పాలి. గతంలో కనిపించని వాడి.. వేడి తాజా ట్వీట్లతో కనిపించటమే కాదు.. భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందే చెప్పేయటం ద్వారా.. తాను చేసే పనులకు సంబంధించిన జస్టిఫికేషన్ ఇప్పటి నుంచే ఇచ్చేస్తున్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి.

'తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారుల్ని జైలుకు తీసుకెళ్లాడు. తన హయాంలో ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లతో సహా పలువురు పోలీసు అధికారులను జైలుపాలు చేయబోతున్నాడు జగన్ రెడ్డి. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్ లో పడి కెరీర్ ని నాశనం చేసుకుంటున్నారు' అంటూ విరుచుకుపడిన లోకేశ్ ట్వీట్ చూస్తే.. ఆయన ట్వీట్ లో వార్నింగ్ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పాలి.

నిజంగానే లోకేశ్ చెప్పినట్లుగా ఏపీలోని అధికారుల తీరు ఉందా? అనే మాటకు టీడీపీ నేతలు ఒకలా.. అధికార పార్టీ నేతల తీరు మరోలా ఉండటం కనిపిస్తుంది. గతంలో ఐఏఎస్.. ఐపీఎస్ లు తమ ప్రైవేటు సంభాషణల్లో రాజకీయాలకు అతీతంగా మాట్లాడే వారు. ఎవరు తప్పు? ఎవరు ఒప్పు? అనే విషయంపై వారి విశ్లేషణ వాస్తవానికి దగ్గరగా ఉండేలా వ్యవహరించేవారు. బ్యాడ్ లక్ ఏమంటే.. ఇటీవల కాలంలో ఆ తీరు పూర్తిగా మారిపోవటమే కాదు.. ఆయా పార్టీల ప్రతినిధుల మాదిరి మాట్లాడటం ఎక్కువైంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలువురు సీనియర్ ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులతో మాట్లాడిన సందర్భంలో ఏపీలోని తమ తోటి అధికారులు చేస్తున్నది తప్పన్న మాట వారి నోటి నుంచి రావటం కనిపిస్తోంది. 'ఏపీలోనే అధికార పార్టీ ఒత్తిడి ఉందని చెప్పట్లేదు. తెలంగాణలోనూ ఉంది. కానీ.. ఈ రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీ తీరును ఎంతమాత్రం పోల్చలేం. తెలంగాణలోనూ ఒత్తిడి ఉంది కానీ ఏపీతో ఎంతమాత్రం పోల్చలేం. అక్కడి పరిస్థితి హారిబుల్' అంటూ కొందరు చెబుతున్న మాటలు చూస్తున్నప్పుడు.. లోకేశ్ మాటలు వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు అనిపించక మానదు.

ఇక్కడ ఇంకో విషయాన్నిప్రస్తావించాలి. ఈ పగలు.. ప్రతీకారాలు ఏమో కానీ.. వీటి కారణంగా దారుణంగా దెబ్బ తింటోంది మాత్రం ఏపీ భవిష్యత్తు. ఏపీ మొత్తం ఈ రోజున రాజకీయం చుట్టూనే తిరుగుతోంది తప్పించి.. మరింకేమీ కాదన్నది నిజమంటున్నారు. ఇలాంటి పరిస్థితే మరింతకాలం కొనసాగితే మాత్రం.. ఏపీ కోలుకోవటానికి దశాబ్దాల సమయం పడుతుందన్న మాట వినిపిస్తోంది. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులకు లోకేశ్ వార్నింగ్ ను ఆయన కోణంలో నుంచి చూస్తే.. కరెక్టే అనిపిస్తోంది. కానీ.. రేపొద్దున అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తున్నవి చేసిన పక్షంలో.. ఇప్పటి అధికారపక్షం చేసే తప్పులే.. లోకేశ్ చేసినట్లు అవుతుంది. ద్వేషపూరిత రాజకీయాలు రాష్ట్రానికి.. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఏమాత్రం మంచిది కాదన్నది మర్చిపోకూడదు.