రాప్తాడు ఎమ్మెల్యే... ప్ర'క్యాష్' రెడ్డి: నారా లోకేష్ సటైర్లు

Fri Mar 31 2023 17:00:02 GMT+0530 (India Standard Time)

Nara Lokesh Comments on MLA Prakash Reddy

టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్.. వైసీపీ నేత ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై సటైర్లు గుమ్మరించారు.  ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి  ధనాశతో ప్ర'క్యాష్' రెడ్డిగా పేరు తెచ్చుకున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రూ.15 కోట్లు కప్పం కట్టకపోతే జాకీ పరిశ్రమని ఏర్పాటు చేయనివ్వనని బెదిరించడంతో ఆ కంపెనీ తరలిపోయిందని భూ నిర్వాసితులు స్థానికులు లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.ప్ర'క్యాష్' రెడ్డి డబ్బు పిచ్చి మా ప్రాంతీయులు ఆరువేల మందికి ఉపాధి దూరం చేసిందని వాపోయారు. యువగళం పాదయాత్రలో శుక్రవారం ఎన్ఎస్ గేటు వద్ద నారా లోకేష్ ని జాకీ పరిశ్రమ భూ నిర్వాసితులు  మహిళలు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.  తోపుదుర్తి కుటుంబ సభ్యుల అవినీతి కారణంగానే రాప్తాడుకు జాకీ పరిశ్రమ రాలేదని ఈ సందర్భంగా నారా లోకేష్ అన్నారు.

జాకీ యాజమాన్యాన్నిఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి రూ.15కోట్లు కప్పం కట్టాలని బెదిరించారన్నారు. కమీషన్ల కక్కుర్తితో జాకీని తరిమేసి 6000 మందికి ఉపాధి దూరం చేశారని విమర్శించారు.  

వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు కొత్తవి రాక ఉన్నవి తరలిపోయి ఉపాధి కోల్పోయామని ఈ సందర్భంగా ఇక్కడివారు లోకేష్‌కు తెలిపారు. దీంతో లోకేష్ స్పందిస్తూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలు రాప్తాడుకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

 మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 2017లో జాకీ కంపెనీని రాప్తాడుకు తీసుకొచ్చామని లోకేష్ తెలిపారు. కంపెనీ కోసం 27ఎకరాల భూమిని కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.

జాకీ సంస్థ పనులు కూడా ప్రారంభించిందని 2019లో రాష్ట్రంలోనూ రాప్తాడులో వైసీపీ రాబందులు అధికారంలోకి వచ్చాయని దుయ్యబట్టారు. కమీషన్ల కోసం జాకీ యాజమాన్యాన్ని వేధించడంతో రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయిందన్నారు.        


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.