Begin typing your search above and press return to search.

ఆ నలుగురి సాయం ... బాబు సీఎం కావడం ఖాయం

By:  Tupaki Desk   |   19 Sep 2022 2:30 AM GMT
ఆ నలుగురి సాయం ... బాబు సీఎం కావడం ఖాయం
X
ఏపీలో తెలుగుదేశం గెలవడానికి తగిన మార్గాలను అన్వేషిస్తోంది. ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదల ఆ పార్టీలో కనిపిస్తోంది. ఇందుకోసం చేయాల్సినవి అన్నీ చేస్తోంది. కొత్త వ్యూహాలను కూడా రచిస్తోంది. ఈసారి ఏపీలో ఓటింగ్ శాతాన్ని పెంచాలని కూడా డిసైడ్ అయింది. దాని కోసం ఇప్పటినుంచే భారీ కసరత్తు చేస్తోంది.

ఏపీలో ఉన్నత వర్గాలు, మధ్యతరగతి వర్గాలలో వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ వర్గాలు నూటికి తొంబై తొమ్మిది శాతం ఫ్యాన్ పార్టీకి ఈసారి రాకూడదని కోరుకుంటున్నాయని ప్రచారం అయితే ఉంది. ఈ వర్గాలు ఎందుకు వైసీపీ మీద ఇంతలా టార్గెట్ చేశాయి అంటే ఈ వర్గాలకు ప్రభుత్వ సంక్షేమంతో పని లేదు. ఈ వర్గాలు రాజకీయ నాయకులు ఇచ్చే పప్పు బెల్లాలకు ఏ రోజునా ఆశపడడం అన్నది జరగలేదు. వారు ఆ కేటగిరిలోకి కూడా రారు.

వీరు కోరుకునేది సుస్థిరమైన పాలన. అలాగే వీరు అభివృద్ధిని చూస్తారు. ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి ఎంతో కొంత జరిగితేనే రాష్ట్రానికి మేలు అని ఆలోచించే వారు ఉన్నత వర్గాలు. ఇక మధ్యతరగతి వర్గాలు తీసుకుంటే వారికి సంక్షేమం అన్నది అందని పండుగా ఉంది. అదే టైం లో వారి మీద వైసీపీ బాదుడు పెద్ద ఎత్తున పడుతోంది. అలా అనేక రకాలుగా పన్నుల బాధతో వారు తల్లడిల్లుతున్నారు.

తాము సర్కార్ కి ఆదాయవనరుగా ఉంటే అభివృద్ధి ఏదీ చూపించకుండా తాయిలాలు మాత్రం వేరే వర్గాలకు ఇవ్వడం పట్ల మిడిల్ క్లాస్ సెక్షన్ ఎపుడూ రగులుతూ ఉంటుంది. ఇక వీరు కూడా ప్రభుత్వం నుంచి ఎపుడూ కోరుకునేది డెవలప్మెంట్ తో పాటు తమకు పన్నులు తగ్గించి బాదుడు నుంచి ఉపశమనం కలిగిస్తారని. కానీ వైసీపీ ఏలుబడిలో చెత్త పన్ను వంటి కొత్తవి కూడా చేరిపోయి మిడిల్ క్లాస్ నడ్డివిరగగొడుతున్నాయి.

దాంతో వీరు పూర్తి వ్యతిరేకంగా మారుతున్నారు. అలాగే తటస్థులు ఒక ప్రత్యేక క్యాటగిరి. . వీరు ఎపుడూ ప్రభుత్వం మార్పులో అత్యంత ముఖ్య భూమిక పోషిస్తారు. నిజానికి పాత ప్రభుత్వం కూలాలి అన్నా కొత్త సర్కార్ రావాలీ అన్నా కూడా వీరే కీలకం. వీరికి రాజకీయ పార్టీలు నాయకుల మీదా ఏ రకమైన అభిమానాలు ఉండవు. మరీ ముఖ్యంగా వీరు ప్రతీ అయిదేళ్లకూ సర్కార్ మారాలని గట్టిగా కోరుకుంటారు. అలాగే విద్యావంతులు ఒక ముఖ్యమైన సెక్షన్ గా ఉంటారు. వీరు ప్రభుత్వం చేసే మంచి చెడ్డలను బాగా విశ్లేషిస్తారు.

తప్పును తప్పుగా చూసే నేర్పు వీరికి ఉంది. ఏ ప్రభుత్వం ఎంత చేసింది. ఎవరి వల్ల ఎంత లాభం, ఎంత నష్టం అన్నది వీరికి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు. ఇలా నాలుగు అతి ముఖ్యమైన సెక్షన్లు ఉన్నాయి. అయితే ఈ నాలుగు సెక్షన్లూ ఈ రోజుకు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి.

అయితే ఈ నాలుగు బలమైన సెక్షన్లు ఓటింగునకు మాతం ఎపుడూ పెద్దగా ఆసక్తి చూపవు. మంచి విమర్శలు చేయమంటే చేస్తాయి. అలాగే విశ్లేషణలు గట్టిగా ఉంటాయి. కానీ పోలింగ్ బూత్ వద్దకు వచ్చి గంటల తరబడి నిలబడి ఓటేయడానికి రెడీ కావు. సరిగ్గా ఈ పాయింట్ నే ఇపుడు టీడీపీ గుర్తించింది అని అంటున్నారు. ఈ సెక్షన్లు కనుక అత్యధిక శాతం పోలింగ్ బూత్ కి వచ్చి ఓటేస్తే వీరి తాకిడికి అధికార పార్టీ వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని టీడీపీ బలంగా నమ్ముతోంది.

వీరు వేసే ప్రతీ ఓటూ వైసీపీని అధికారం నుంచి దూరం చేసేదే కావడం, అది కచ్చితంగా బాహాటంగా రుజువు అవుతున్న నేపధ్యంలో వీరి ఓట్లను వదులుకోరాదని టీడీపీ భావిస్తోంది. ఈ రోజున విమర్శలు చేయడం కాదు, ఎన్నికల వేళ కాస్తా తీరిక ఓపిక చేసుకుని పోలింగుకు వస్తే కనుక అది అధికార పార్టీ ఓటమికి కారణం అవుతుంది అని టీడీపీ తమ్ముళ్ళు వీరికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

టీడీపీ ఈసారి ప్రచారం కూడా విభిన్నంగా ఉండబోతోంది. స్లమ్ ఏరియాల్తో పాటు అపార్టుమెంట్లను మామూలు ఇళ్ళను ఈసారి టచ్ చేస్తూ పోతారని అంటున్నారు. అలాగే ఇప్పటి నుంచే అపార్టుమెంట్ల వాసులతో టీడీపీ వారు చర్చాగోష్టులు వంటివి నిర్వహించి వారిని తమ వైపునకు మళ్ళేలా చూసుకుంటున్నారు. తప్పనిసరిగా ఓట్ చేసేలా వారి మైండ్ సెట్ ని మారుస్తున్నారు.

వీరు కనుక పోలింగ్ బూతులకు వస్తే ఓటెత్తితే పోలింగ్ శాతంలో కూడా భారీ తేడా రావచ్చు. అదే విధంగా అధికార పార్టీ వైసీపీకి చుక్కలు చూపించే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి ఆ నలుగురి సాయం కోసం టీడీపీ ఎదురుచూస్తోంది. వారు కనుక ముందుకొస్తే రేపటి రోజున టీడీపీదే అధికారం అని భావిస్తున్నారుట.