Begin typing your search above and press return to search.

సేఫ్ జోన్ : జనంతోనే ఇక అంతానట...?

By:  Tupaki Desk   |   15 May 2022 12:30 PM GMT
సేఫ్ జోన్ : జనంతోనే ఇక అంతానట...?
X
చంద్రబాబు రాజకీయ చాణక్యుడు. ఆయన ఏం చేసిన బహుళ ప్రయోజనాలు అందులో ఉంటాయి. అలాంటి చంద్రబాబు ఇపుడు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇక మీదట తాను పూర్తి కాలం జనంతోనే ఉండడానికి ఆయన పక్కాగా ప్రోగ్రాం డిజైన్ చేసుకున్నారు అని తెలుస్తోంది. ఇలా ఎందుకు బాబు ఆలోచిస్తున్నారు అంటే దానికి ఈ మధ్య ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలే కారణం అంటున్నారు.

గత మంత్రివర్గంలో దాదాపుగా చంద్రబాబుకు కుడి భుజంగా పనిచేసి బాబు కలల రాజధాని అమరావతికి తన వంతు సాయం చేసిన మునిసిపల్ శాఖ మాజీ మంత్రి నారాయణను హఠాత్తుగా హైదరాబాద్ వచ్చి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఎపుడు ఏ నాయకుడి మీద అరెస్ట్ దెబ్బ పడుతుందో అని సీనియర్లు అంతా వణుకుతున్నారు.

మరో వైపు చూస్తే సీయార్డీఏ పెట్టిన కేసులలో చంద్రబాబు ఏ వన్ గా నారాయణ ఏ టూగా ఉన్నారు. దాంతో గత కొద్ది రోజులుగా బాబు అరెస్ట్ అవుతారు అని వార్తలు వినిపించాయి. ఈ విషయంలో వైసీపీ సర్కార్ అంతదాకా వెళ్తుందా అంటే ఏమో ఎవరూ అలా జరగదు అని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి. జగన్ కనుక తలచుకుంటే బాబు ఏ క్షణాన అయినా అరెస్ట్ కావడం ఖాయమనే అంటున్నారు.

దాంతో చంద్రబాబు కూడా తన ప్లాన్ మార్చేశారు అంటున్నారు. నిరంతరం జనాల్లో ఉండడం ద్వారా అటు పార్టీని పటిష్టం చేసుకోవడమే కాకుండా తన అరెస్ట్ విషయంలో కూడా అధికార పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చునని ఆలోచిస్తున్నారు అంటున్నారు. జన సమూహంలో బాబు లాంటి సీనియర్ లీడర్ ఉంటే అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం వెనకాడుతుంది అన్న మాట ఉంది.

ఇక ఒకవేళ అంతకూ తెగించి అరెస్ట్ చేసినా ఆ వెంటనే వెల్లువలా వచ్చే సానుభూతి టీడీపీకి కొండంత ప్లస్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు. ఇక బాబు అరెస్టుకు కనుక వైసీపీ ఒడిగడితే కచ్చితంగా దానికి వైసీపీ సర్కార్ భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ఆయన వయసు, రాజకీయ సీనియారిటీ కూడా ఇక్కడ చర్చకు వస్తాయని, ఒక విధంగా కొరివితో తలగోక్కోవడమే వైసీపీ పని అవుతుంది అంటున్నారు.

మొత్తానికి తన అరెస్ట్ విషయంలో చంద్రబాబుకు ఎలాంటి భయం లేదని, అయితే వైసీపీ దుస్సాహం కనుక చేస్తే దాన్ని రాజకీయంగా బంబాట్ చేయడానికే బాబు నిరంతరం జనాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు జనాల్లో టూర్లు వేస్తూ పోతూ ఉంటే ఒక వైపు రాజకీయ వత్తిడి కూడా వైసీపీ మీద ఉంటుంది.

మరో వైపు ఆయన్ని అరెస్ట్ చేయాలన్న అజెండాను కూడా అమలు చేయలేకపోవచ్చు అంటున్నారు. ఇలా పక్కా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న చంద్రబాబు దటీజ్ సీనియారిటీ అని చెప్పకనే చెబుతున్నారు అనుకోవాలి.