కుప్పంలో మరచిపోలేని కార్యక్రమానికి బాబు శ్రీకారం

Fri May 13 2022 23:00:01 GMT+0530 (IST)

Nara Chandrababu Naidu TDP

చంద్రబాబు అంటేనే రాజకీయ చాణక్యుడు. ఆయన ఆలోచించి కానీ ఏదీ చేయరు. లేకపోతే 33 ఏళ్ల తరువాత ఆయనకు ఆ ఆలోచన రావడం ఏంటి. ఎందుకిలా జరుగుతోంది అంటే దాని వెనక చాలా కారణాలే ఉన్నాయి. చంద్రబాబు ఇంతకీ కుప్పంలో చేసే మహత్తర కార్యక్రమం ఏంటి అంటే ఆయన ఒక ఇంటి వాడు అవుతున్నాడు.అదేంటి బాబు ఎపుడో ఇంటి వాడు అయ్యాడు కదా. అంటే అది కాదు ఇల్లు కట్టి చూపిస్తారు అంటున్నారు. దానికీ వెంటనే జవాబు ఉంది. వందల కోట్లతో హైదరాబాద్ లో బాబుకు ఇల్లు ఉంది కదా మళ్లీ ఇదేంటి అంటే అదే బాబు మార్క్ పాలిటిక్స్. కుప్పం బాబు సొంత సీటు.  1989లో ఆయన ఫస్ట్ టైమ్ గెలిచినది లగాయితీ ఈ రోజు వరకూ ఏడు సార్లు గెలుస్తూ వస్తున్నాడు.

కానీ ఆయనకు అక్కడ సొంత ఇల్లు అయితే లేదు. కుప్పం ప్రజలకు ఎటూ సేవ చేస్తున్నాను కదా ఎక్కడ ఉంటేనేంటి అని బాబు తలచి ఉండవచ్చు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ్లోనే కుప్పం విషయంలో గట్టిగానే రాజకీయం చేసింది. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో అయితే కుప్పంలో అన్ని సీట్లూ వైసీపీ పరం అయ్యాయి.

ఇక కొట్టేది పట్టేది ఎమ్మెల్యే సీటే సుమా అని వైసీపీ ఒక వైపు గర్జిస్తోంది. ఇంకో వైపు బాబు అక్కడ ఒక ఇంచార్జిని పెట్టి ఇంతకాలం కధ నడిపించినా వారు ఎందుకో వైసీపీ పాలిటిక్స్ ముందు తేలిపోతున్నారు. దీంతో తానే సోలోగా  ఫీల్డ్ లోకి దిగాలని బాబు డిసైడ్ అయి గత ఏడాదికి వీలు దొరికినపుడల్లా కుప్పం వెళ్లి వస్తున్నారు.

ఇపుడు బాబు ఏకంగా కుప్పం వాసిని తాను అని చెప్పుకోవడానికి అక్కడ  రెండున్నర ఎకరాలలొ  మంచి ఇల్లు ఒకటి కట్టబోతున్నారు. అంతే కాదు ఆ ఇంటితో పాటే ఒక ఆఫీస్ కూడా అక్కడ కట్టి జనాల నుంచి వినతులు తాను ఉన్నా లేకున్నా తీసుకునేలా భారీ ప్రోగ్రాం నే డిజైన్ చేశారు.

ఇక ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి శంఖుస్థాపన జూన్ 5న సతీమణి భువనేశ్వరితో కలసి బాబు చేస్తారని అని అంటున్నారు. ఆరు నెలల తేడాలో భవ్యమైన బాబు ఇల్లు రెడీ అవుతొంది. మొత్తానికి బాబు కుప్పం వాసిగా ఉండబోతున్నారు. మరి జనం తమ మదిలో ఆయన్ని పెట్టేసుకుంటారా. ఈసారి కుప్పంలో అదిరిపోయే మెజారిటీ వస్తుందా. ఏమో చూడాలి.