Begin typing your search above and press return to search.

మోకా హత్య కేసుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   4 July 2020 5:18 PM GMT
మోకా హత్య కేసుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
X
మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రధాన అనుచరుడు నాంచారయ్య ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడని పోలీసులు వెల్లడించారు. మచిలీపట్నంలో ఆధిపత్య పోరులో భాగంగానే మోకాను హత్య చేయాలని నాంచారయ్య భావించినట్లు వెల్లడించారు. ఈ హత్యకు వ్యూహ రచన కొల్లు రవీంద్ర ఇంట్లో జరిగిందని, కొల్లు రవీంద్ర సూచన ప్రకారమే ఈ హత్య చేసినట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్ విధించడంతో...పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, కొల్లు రవీంద్రను పోలీసులు ఎలాంటి విచారణ లేకుండా అరెస్టు చేయడంపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలపై పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోకా భాస్కర్ రావు హత్యకేసులో కొల్లు రవీంద్ర పాత్రతోపాటుగా దేవినేని ఉమా, చంద్రబాబు హస్తం కూడా ఉండి ఉంటుందని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు.

కొల్లు రవీంద్రతో మాట్లాడిన తర్వాతే మోకాను హత్య చేసినట్లుగా నిందితులు అంగీకరించారని, ఈ హత్య వెనుక కొల్లు రవీంద్ర హస్తముందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కొడాలి నాని అన్నారు. కొల్లు రవీంద్ర ఏ తప్పు చేయకపోతే రాష్ట్రం విడిచి దొంగలా పారిపోవాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. తనపై వచ్చిన హత్య ఆరోపణలకు రవీంద్ర సమాధానం చెప్పకుండా పారిపోతున్నారని, అందుకే పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. ఈ హత్య కేసులో తన పాత్ర ఉంది కాబట్టే పారిపోయేందుకు రవీంద్ర ప్రయత్నించారని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీలో పేర్నినానికి మోకా ప్రధాన అనుచరుడిగా ఉన్నారని, మచిలీపట్నంలో కీలక నేతగా మోకా ఎదుగుదలను చూసి రవీంద్ర, నాంచారయ్య తట్టుకోలేకపోయారని అన్నారు. అందుకే, మోకాను అడ్డు తొలగించుకోవాలని....హత్యారాజకీయాలకు తెరతీశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యకేసులో రవీంద్ర పాత్రపై పూర్తి ఆధారాలున్నాయన్నారు. బలహీన వర్గాలకు చెందిన మోకా వంటి నాయకులని చంపి వైసీపీని బలహీనపరచాలన్న కుట్రను టీడీపీ నేతలు పన్నారని అన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు టీడీపీ నేతలు పారిపోవడం ఆనవాయితీ అని, అనవసర విషయాలపై గంటల కొద్దీ ప్రెస్ మీట్ లు పెట్టడం వారికి అలవాటేనని నాని ఎద్దేవా చేశారు.