Begin typing your search above and press return to search.

ఆత్మ‌స్తుతి.. ప‌ర‌నింద అంతేనా లక్ష్మీపార్వ‌తి?

By:  Tupaki Desk   |   26 Sep 2022 9:13 AM GMT
ఆత్మ‌స్తుతి.. ప‌ర‌నింద అంతేనా లక్ష్మీపార్వ‌తి?
X
ఒక్కమాట‌లో చెప్పుకోవాలంటే.. ఆత్మ‌స్తుతి.. ప‌ర‌నింద. తాజాగా మీడియా ముందుకొచ్చిన నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి ప్ర‌సంగం తీరు ఇదే. విజ‌య‌వాడ‌లో ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీకి వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్సిటీ అని పేరు మార్చ‌డంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌టా నిర‌స‌న‌లు చెల‌రేగుతున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై పార్టీల‌క‌తీతంగా అన్ని పార్టీలు, ప్ర‌జా సంఘాలు, చివ‌రికి సొంత చెల్లెలు ష‌ర్మిల‌, సొంత పార్టీ నేతలు యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ వంటివారు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే దొంగ‌లు ప‌డ్డ ఆర్నెళ్ల‌కు కుక్కలు మొరిగిన‌ట్టు ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీకి పేరు మార్చి వారం రోజుల‌వుతున్నా మీడియా ముందుకు రావ‌డానికి ల‌క్ష్మీపార్వ‌తికి తెల్లార‌లేద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వివిధ మీడియా సంస్థ‌లు, వ్య‌క్తుల విమ‌ర్శ‌లతో ఎట్ట‌కేల‌కు మీడియా ముందుకొచ్చిన ల‌క్ష్మీపార్వ‌తి అస‌లు విష‌యాన్ని గాలికొదిలేశారు. తాను ఎన్టీఆర్ జీవితంలో ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి ఏం జ‌రిగిందో చెప్ప‌డానికే ఒక గంట‌పాటు త‌న కంఠ‌శోష‌ను చెప్పుకొచ్చారు.

ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి త‌న గురించి, ఎన్టీఆర్ గురించి అప్ప‌ట్లో త‌ప్పుడు క‌థ‌నాలు రాశాయ‌ని, కార్టూన్లు వేశాయ‌ని ఇప్ప‌టికే వంద‌ల‌సార్లు చెప్పిన క్యాసెట్‌నే మ‌ళ్లీ వేశారు. యూనివ‌ర్సిటీకి పేరు మార్చ‌డంపై ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌లన విష‌యాలు ఏమైనా మాట్లాడ‌తేరేమో లేదా యార్ల‌గడ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ రాజీనామా చేసిన‌ట్టు తెలుగు అకాడ‌మీ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేస్తారేమోన‌ని ఎదురుచూసిన ఎన్టీఆర్ అభిమానుల‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. క‌నీసం పేరు మార్పు నిర్ణ‌యంపై ఆలోచించాల‌ని జ‌గ‌న్ బాబును వేడుకుంటారేమోన‌ని అనుకున్న‌ప్ప‌టికీ నిరాశే ఎదురైందంటున్నారు.

ఆత్మ‌స్తుతి.. ప‌ర‌నింద టైపులో రామోజీరావును, వేమూరి రాధాకృష్ణ‌ను, చంద్ర‌బాబును, ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులను విమ‌ర్శించ‌డానికే తన గంట ప్ర‌సంగాన్ని వెచ్చించారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చ‌డంపై జ‌గ‌న్ బాబు నిర్ణ‌యం స‌మ‌ర్థనీయ‌మేనంటూ ఆమె మాట్లాడ‌టం అంద‌రినీ నివ్వెర‌ప‌రిచింద‌ని అంటున్నారు.

నేతి బీర‌కాయిలో నెయ్యి ఎంత ఉంటుందో.. ఎన్టీఆర్ అన్నా, ఎన్టీఆర్ ఆశ‌యాలన్నా ల‌క్ష్మీపార్వ‌తికి అంతే విలువ ఉంద‌ని ఎద్దేవా చేస్తున్నారు. జ‌గ‌న్ ఇచ్చిన తుచ్చ‌మైన ప‌ద‌వికి ఆశ‌ప‌డి ఆఖ‌రుకు ఎన్టీఆర్‌ను కూడా త‌క్కువ చేసే స్థాయికి ల‌క్ష్మీపార్వ‌తి వ‌చ్చింద‌ని మండిప‌డుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.