భర్త పేరును తీసేసినా నోటి వెంట మాట రాలేదేం లక్ష్మీపార్వతి?

Sun Sep 25 2022 09:44:52 GMT+0530 (India Standard Time)

Nandamuri Lakshmi Parvathi

'ఎన్టీఆర్' అన్నది పేరు కాదు బ్రాండ్ అంటూ బాలయ్య చెప్పిన మాట నిజం. ఆయన లక్ష్మీపార్వతి లాంటి అపర రాజకీయ మేధావి భర్తనో.. నందమూరి కుటుంబ పెద్దనో అనే కంటే తెలుగు వారందరికి ఆయన ఆప్తుడు. ప్రాంతాల వారీగా తెలుగు వారు విడిపోయినప్పటికీ.. ప్రాంతీయ సరిహద్దుల్ని దాటేసి.. తెలుగు వారి మనసుల్లో నిండుగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీవోడే. అలాంటి ఎన్టీఆర్ పేరును దశాబ్దాల క్రితం ఏపీలోని హెల్త్ వర్సిటీకి పెడితే.. దాన్నితీసేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే.. విమర్శలు చేస్తున్న వారందరిపై విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు.తాము తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదంటూ విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు. నిజమే.. వైసీపీ నేతల మాటల ప్రకారం చూస్తే.. అటు చంద్రబాబుకు.. ఇటు నందమూరి కుటుంబానికి.. టీడీపీ నేతలకు ఎవరికి అర్హత లేదనుకుందాం. మరి.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి సంగతేంటి? ఆమెకు కూడా అర్హత లేదా? వైసీపీలో ఉండి.. జగన్ చలువతో రాష్ట్ర తెలుగు -సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ వ్యవహరిస్తున్న ఆమెకు.. జగన్ తీసుకున్న నిర్ణయంపై రియాక్టు కాలేదు.

పార్టీ.. పదవుల్ని కాసేపు పక్కన పెడితే.. ఎన్టీఆర్ కట్టుకున్న భార్యగా లక్ష్మీపార్వతికి.. తన భర్త పేరును తాను సేద తీరుతున్న పార్టీలో పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటే ఫైర్ కావాల్సిన అవసరం లేదా? రాజకీయంగా ఎన్నో ఆలోచనలు.. మరెన్నో ఆశలు ఉన్నప్పటికీ అవేమీ సాధ్యం కాక.. రాక రాక వచ్చిన పదవి (రాష్ట్ర తెలుగు -సంస్కృత అకాడమీ చైర్ పర్సన్)ని వదులుకోవటానికి ఇష్టపడకనే మౌనంగా ఉన్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఎన్టీఆర్ నందమూరి సొంతం కాదని.. తన సొంతమని వాదించే లక్ష్మీపార్వతి.. మరి భర్త పేరును తాను ఉన్న పార్టీనే పవర్ లో ఉండి తీసివేయటం ఆమెకు తప్పుగా అనిపించలేదా? అన్నది మరో సందేహం. తరచూ ఏదో ఒక కారణాన్ని ఎత్తి చూపుతూ ఎన్టీవోడు తన వాడని చెప్పుకునే లక్ష్మీపార్వతి.. తాజా సందర్భంలో మౌనంగా ఉండటం ఎన్టీఆర్ ఆత్మ ఘోషించటం ఖాయమని చెప్పక తప్పదు. ఎన్టీవోడికి చంద్రబాబు.. బాలయ్య ఇలా పలువురు వెన్నుపోటు పొడిచారని ప్రచారం చేసే వైసీపీ నేతల మాటకు అదనంగా లక్ష్మీపార్వతి పేరును కూడా చేర్చాలి కదా? అన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.