Begin typing your search above and press return to search.

సాగర్ ఉప ఎన్నికపై జోస్యం చెప్పేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   27 Feb 2021 8:00 AM GMT
సాగర్ ఉప ఎన్నికపై జోస్యం చెప్పేసిన కేసీఆర్
X
ఎన్నికల వేళ.. తాను చెప్పే అంచనాలకు ఉండే ప్రాధాన్యతను తనకు అనుకూలంగా మార్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారా? అంటే అవునన్నట్లుగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఎన్నిక అన్నంతనే ఉత్సాహంతో బరిలోకి దిగే టీఆర్ఎస్ కు తాజాగా.. ఎన్నికలన్నంతనే ఒకలాంటి ఫియర్ వెంటాడుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక.. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారటం తెలిసిందే. కాస్త గ్యాప్ తర్వాత రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరగటం.. త్వరలో సాగర్ ఉప ఎన్నికపై క్లారిటీ రావటం తెలిసిందే.

తాజాగా ప్రగతిభవన్ లో జరిపిన రివ్యూలో కేసీఆర్ నోట ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలో జరిగే నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై తనకున్న అంచనాను సీఎం పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ దేనని స్పష్టం చేసిన కేసీఆర్.. అందుకు బలం చేకూరే మరిన్ని అంశాల్ని ప్రస్తావించారు. మొన్నటివరకు ఎన్నికల్లో తమ ప్రత్యర్థి బీజేపీ అని చెప్పే టీఆర్ఎస్.. ఇప్పుడు అందుకు భిన్నంగా కాంగ్రెస్ తమ ప్రత్యర్థిగా పేర్కొనటం గమనార్హం.

అంతేకాదు.. సాగర్ ఉప ఎన్నికల్లో 48 శాతం ఓట్లతో టీఆర్ఎస్ గెలవబోతుందన్న లెక్క.. గులాబీ బాస్ నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 35 నుంచి 36 శాతం ఓట్లు రానున్నాయని.. బీజేపీ అభ్యర్థికి 7-8 శాతం ఓట్లు మాత్రమే రానున్నట్లుగా ఆయన పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. తమకు వచ్చే ఓట్ల శాతం గురించి చెప్పిన కేసీఆర్.. ప్రత్యర్థులకు వచ్చే ఓట్లను చెప్పి తప్పు చేశారా? అన్నది ప్రశ్నగా మారింది.

ఒకవేళ సారు లెక్కల ప్రకారం సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందనే అనుకుందాం. కానీ.. ఎడెనిమిది శాతం ఓట్లు మాత్రమే బీజేపీకి వస్తాయని చెప్పిన వేళ.. అందుకు భిన్నంగా ఏ ఇరవై శాతమో ఓట్లు వచ్చాయంటే.. కేసీఆర్ లెక్క తప్పటమే కాదు..బీజేపీకి పెరిగిన బలాన్ని.. టీఆర్ఎస్ కు తగ్గిన అధిక్యత గురించి ఒప్పుకోక తప్పదు. అన్ని తెలిసిన కేసీఆర్.. కీలకమైన ఎన్నికల వేళ ఇలా మాట్లాడటం ఏమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.