ఆ పదం వాడకుండా జూనియర్ ఎన్టీయార్...?

Sun Jan 29 2023 14:29:08 GMT+0530 (India Standard Time)

NTR Kalyan Ram Reaches Bengaluru To See Taraka Ratna

తన సోదరుడు తారకరత్న బెంగళూరు లోని హృదయాలయ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపధ్యంలో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలిసి ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్  మరో సోదరుడు కళ్యాణ్ రాం తో కలసి ఆసుపత్రికి వచ్చారు. తారకరత్నను పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు చాలా జాగ్రత్తగా ఆచీ తూచీ అన్నట్లుగా ఉన్నాయని అంటున్నారు.ఆయన తారకరత్న ఆరోగ్యం పట్ల కలత చెందుతున్నారు. అదే టైం లో తన టూర్ పూర్తిగా కుటుంబ సభ్యుడిగానే అని చెప్పుకొచ్చారు. ఈ నెల 27న ఒక అనుకోని దుర్ఘటన జరిగి తన అన్న తారకరత్న ఆసుపత్రి పాలు అయ్యారు. ఆయన పరిస్థితి సీరియస్ గా ఉంది. అయినా ఆశలు మాత్రం వదులుకోవడం లేదు అని జూనియర్ చెప్పారు. అయితే ఈ నెల 27న తారకరత్న లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయన అక్కడే గుండెపోటుకు గురి అయ్యారు.

ఆ విషయాన్ని జూనియర్ తరువాత మాట్లాడిన కర్నాటక వైద్యమంత్రి కూడా పాదయాత్ర అంటూ కోట్ చేసి చెప్పుకొచ్చారు. కానీ జూనియర్ మాత్రం కేవలం తన అన్న అనారోగ్యం వరకే పరిమితం అయ్యారు తప్ప ఎక్కడా పాదయాత్రలో పాలుపంచుకోవడం అంటూ వివరాలు లోతుల జోలికి పోలేదు అని అంటున్నారు. పాదయాత్ర అంటే లోకేష్ ది. అది రాజకీయ పరమైనది. మరి ఆ విషయాలు అప్రస్తుతం అని భావించి కేవలం   తారకరత్నకు   అనారోగ్యం ఫలానా రోజున చేసింది అని మాత్రమే జూనియర్ చెప్పారని అంటున్నారు.

ఇక జూనియర్ తనతో పాటు కళ్యాణ్ రాం ని వెంటబెట్టుకుని వచ్చారు. మరో వైపు చూస్తే మీడియాతో జూనియర్ బాబాయ్ బాలక్రిష్ణ  కూడా వేరేగా మాట్లాడారు ఆయన కన్నడ నటుడు శివరాజ్ కుమార్ తో కలసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. శివరాజ్ కుమార్ పరామర్శకు రావడం తమకు కొండంత బలం అని చెప్పారు. జూనియర్ బాలయ్య ఇలా విడివిడిగానే మీడియాను కలిసి మాట్లడారు.

నిజానికి జూనియర్  ఎన్టీయార్  28న రావాల్సి ఉన్నా అనూహ్యంగా ఆయన తన ప్రోగ్రాం షెడ్యూల్ ని 29కి మార్చుకున్నారు. అయితే 28న మాత్రం చంద్రబాబు పురంధేశ్వరి వంటి వారు వచ్చి తారకరత్నను పరామర్శించారు. మొత్తానికి జూనియర్ కుటుంబ సభ్యుడిగా ఒక తమ్ముడిగా వచ్చి తన బాధ్యత మేరకు పరామర్శించారు అని అంతా అంటున్నారు. అదే టైం లో ఆయన ఏ రకమైన ఊహాగానాలకు ప్రచారాలకు అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా తన టూర్ ని ప్లాన్ చేసుకున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే చాలా క్లుప్తంగా మీడియాతో మాట్లాడిన జూనియర్ నోట పాదయాత్ర మాట మాత్రం రాలేదు. ఇదే ఇపుడు చర్చగా ఉంది మరి.