ఏప్రిల్ 1.. దేశంలో కొత్త టోల్ బాదుడుతో సామాన్యుడిపై దోపిడీ

Sat Apr 01 2023 13:06:29 GMT+0530 (India Standard Time)

NHAI Hike in Toll Rates

అమ్మో 1వ తారీఖు అనేలానే పరిస్థితులున్నాయి. దేశంలో మోడీ సర్కార్ వచ్చాక సామాన్యులపైనే భారం వేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్ లో ఇటీవల కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సామాన్యుడి జీవితంపై పెనుభారం పడుతోంది.  తాజాగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్ఏఐ) ఒక షాకింగ్ న్యూస్ ప్రకటించింది. టోల్ ఛార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను సమీక్షిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది 5 నుంచి 10శాతం వరకూ ఛార్జీలు పెంచుతున్నట్టు అధికారులు తెలిపారు.

టోల్ ఛార్జీల పెంపు నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమలవుతాయి. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల (బైక్ మినహా టారిఫ్ ధరలను 10 రూపాయల నుంచి 60 రూపాయల వరకూ పెంచారు.

ఈ నిర్ణయంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడనున్నాయి. జాతీయ రహదారుల రుసుముకు సంబంధించిన రూల్స్ 2008 ప్రకారం సవరించిన టోల్ రేట్ల ప్రతిపాదన మార్చి 25వ తేదీ నాటికి కేంద్ర రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రిత్వశాఖల ఆమోదానికి పంపబడింది. దీని ప్రకారం కార్లు తేలికపాటి వాహనాలపై ఒక్కో ట్రిప్పునకు 5వాతం భారీ వాహనాలకు టోల్ టాక్స్ అదనంగా 10శాతం పెంపు చేసి వసూళ్లు మొదలుపెట్టారు.

అయితే ప్రతి పంవత్సరం టోల్ టాక్స్ లను పెంచుతున్న పరిస్థితి వాణిజ్య అవసరాల కోసం వినియోగించే భారీ వాహనదారులకు సైతం ఇబ్బంది కలిగిస్తోంది.  ఈ సంవత్సరం 5 నుంచి 10శాతం వరకూ టోల్ ఛార్జీలు పెంచడంతో నేషనల్ హైవేల మీద ప్రయాణం చేసే వాహనదారులు తీవ్ర అసహనంతో ఉన్నారు.

ఇక ఇప్పటికే పెంచిన టోల్ పన్నులు తగ్గించాలని రాష్ట్రాల్లోని లారీ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో ఆందోళనలు కూడా చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు గరిష్టానికి చేరుకొని నిత్యావసరాలు మండిపోతున్న వేళ టోల్ బాదుడు కూడా మొదలు కావడం సామాన్యుల జీవితాలపై పెనుభారం పడేలా చేస్తోంది.     


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.