ఎన్జీటీ దూకుడు.. ఏపీ సర్కారుకు చెప్పకుండానే `సీమ` ప్రాజెక్టు సందర్శనకు ఆదేశం

Fri Jul 23 2021 21:00:01 GMT+0530 (IST)

NGT wants to see a rayalaseema project

ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై.. తెలంగాణ చేస్తున్న వాదాన్ని.. సామర స్య పూర్వకంగా పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన.. జాతీయ హరిత ట్రైబ్యునల్.. దూకుడుగా వ్యవహరిస్తోంది. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సీమ జిల్లాలైన కర్నూలు కడప అనంతపురంతోపాటు చిత్తూరుకు కూడా సాగు తాగు నీరు ఇచ్చేం దుకు .. ఇక్కడి కరువు భూముల్లో కమతాలు కళకళలాడేలా చేసేందుకు జగన్ సర్కారు నడుం బిగించింది. అయితే.. దీనిపై ఆది నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే దీనికి అనుమతుల విషయంలో ఎన్జీటీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి అక్కడ ఎలాంటి పనులు  జరుగుతున్నాయో.. అక్కడి పరిస్థితి ఏంటో.. పరిశీలించి నివేదిక ఇవ్వాలని గతంలో కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) కేంద్ర పర్యావరణ శాఖను ఎన్జీటీ ఆదేశించిం ది. అయితే.. ప్రాజెక్టు సందర్శనకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని కేఆర్ ఎంబీ.. ఎన్టీజీలో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే.. ఈ విషయంలో స్పందించాల్సిన  కేంద్ర పర్యావరణ శాఖ మౌనంగా ఉంది. ఇక ఇదే అంశంపై.. ఎన్జీటీకి ఏపీ సర్కారు తన వాదనను కూడా వినిపించింది. తాము ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించడం లేదని.. కేవలం ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి చెందిన అధ్యయనాల పనులు మాత్రమే చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

అయితే.. ఎట్టి పరిస్థితిలోనూ సీమ ప్రాజెక్టును నిలుపుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్న తెలంగాణ సర్కారు.. మరోసారి.. ఎన్జీటీలో పిటిషన్ వేసింది. ఏపీ ప్రభుత్వం కేఆర్ ఎంబీకి సహకరించడం లేదని.. ఈ క్రమంలో ఎన్జీటీనే వెళ్లి సీమ పథకాన్ని సందర్శించాలని తెలంగాణ అసిస్టెంట్ అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) రామచంద్రరావు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. హెలికాప్టర్ సహా అన్ని సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన చెప్పడాన్ని బట్టి చూస్తే.. తెలంగాణ సర్కారు దీనిని ఎంతగా నిలుపుదల చేయాలని నిర్ణయించుకుందో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇక తెలంగాణ అభ్యర్థనపై  స్పందించిన ఎన్జీటీ ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగానే వెళ్లాలని కృష్ణా బోర్డును ఆదేశించింది.  

రాయలసీమ ఎత్తిపోతల పథకంలో పరిశీలన జరిపిన తర్వాత స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కేఆర్ ఎంబీని ఆదేశించింది. కేసు విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ.. సీమ ప్రాంతానికి చెందిన వైసీపీ మినహా ఏ ఇతర నేతలు దీనిపై రియాక్ట్ కాకపోవడం గమనార్హం.