అంతరిక్షంలో యాక్సిడెంట్ నేడే.. నాసా ఎందుకిలా చేస్తోంది?

Sun Sep 25 2022 13:20:32 GMT+0530 (India Standard Time)

NASA spacecraft to collide with asteroid for first time

యాక్సిడెంట్లు అనుకోకుండా.. అనూహ్యంగా జరుగుతుంటాయి. అందుకు భిన్నంగా కావాలనే యాక్సిడెంట్ చేస్తే? అది కూడా అనంత విశ్వంలో భూమికి కోట్ల కిలోమీటర్ల దూరంలో? అది కూడా భారీ శకలాన్ని లెక్కలేసుకొని మరీ ఢీ కొడితే.. అలాంటి కీలక ప్రయోగాన్ని చేస్తోంది నాసా. ఎందుకిలా అన్నది తెలుసుకోవాల్సిందే.అనంతకోటి విశ్వంలో వింతలకు.. విశేషాలకు లోటు లేదు. శాస్త్రసాంకేతికంగా పెద్ద ఎత్తున డెవలప్ అయినట్లుగా చెప్పుకున్నా.. ఈ విశ్వంలో మనిషి ఒక బుల్లి పరిమాణవు మాత్రమే. కాకుంటే.. బుద్ధి జీవి కావటంతో.. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. భూగ్రహానికి అప్పుడప్పుడు అపాయంగా మారే గ్రహశకలాలతో ఏం జరుగుతుందో అప్పుడప్పుడు ఎంతలా టెన్షన్ పడేది తెలిసిందే.

అలా అర్థం కాని కొన్ని విషయాల్ని.. ఒక క్రమపద్దతిలో తెలుసుకోవటానికి వీలుగా నాసా ఒక విచిత్రమైన ప్రయోగానికి తెర తీసింది. సాధారణంగా జరిగే యాక్సిడెంట్లకు భిన్నంగా పక్కా ప్లాన్ తో నాసా చేపడుతున్న ఈ భారీ యాక్సిడెంట్ శాస్త్రవేత్తల్లో ఆసక్తిని పెంచుతోంది. సాధారణంగా భూమిని ఢీ కొనేందుకు గ్రహ శకలాలు దూసుకొస్తుంటాయి.అందుకు భిన్నంగా సదూరాన ఉన్న గ్రహ శకలాన్ని.. ఒక ఉప గ్రహం వెళ్లి ఢీ కొనేలా ప్లాన్ చేసింది నాసా.

గంటకు 24 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఒక గ్రహ శకలాన్ని.. భూమికి 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఏడాది క్రితం ప్రయోగించిన శాటిలైట్.. ఉద్దేశపూర్వంగా ఢీ కొట్టనుంది. అంతరిక్ష రక్షణ పరీక్షల్లో భాగంగా డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ టెస్టు పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రయోగం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. గ్రహ శకలాలు ఎప్పుడైనా భూమిని ఢీ కొట్టే ముప్పు ఎదురైతే.. దాన్ని తప్పించుకునేందుకు ఈ ప్రయోగం సాయం చేస్తుందని చెబుతున్నారు.

భారత కాలమానం ప్రకారం చూస్తే మంగళవారం తెల్లవారుజామున 4.44 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరగనుంది. 32.5 కోట్ల డాలర్ల ఖర్చుతో ఏడాది క్రితం ఈ ఉప గ్రహాన్ని ప్రయోగించారు. తన కంటే ఎంతో పెద్దది అయిన డిడిమోస్ అనే గ్రహశకలం చుట్టూ తిరుగుతోంది. ఈ రెండు సోమవారం భూమికి అత్యంత సమీపానికి అంటే.. 108 కోట్ల కిలోమీటర్ల దూరానికి రానున్నాయి.

ఢీ కొన్న తర్వాత గ్రహశకలం కాంతిలో వచ్చే మార్పుల్ని చూడొచ్చొంటున్నారు. శాటిలైట్ తో ఢీ కొట్టిన తర్వాత గ్రహ శకలం వేగంలో కనీసం 73 సెకన్ల మార్పు వచ్చినా ప్రయోగం సక్సెస్ అయినట్లేనని చెబుతున్నారు.ఈ ప్రయోగం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నకు వస్తున్న సమాధానం ఏమంటే..ఎప్పుడో ఒకప్పుడు భూమికి వినాశనంగా మారే గ్రహశకలం నుంచి భూమిని రక్షించుకునే మార్గాన్ని గుర్తించే వీలుంది. ఇప్పటివరకు లేదు కానీ.. ఒక అంచనా ప్రకారం 460 అడుగుల కంటే పెద్దదైన అంతరిక్ష శకలం ఏదైనా భూమికి 46 లక్షల మైళ్ల కంటే దగ్గరగా వస్తే దాంతో భూగ్రహానికి అపాయకరం. అలాంటి సందర్భంలో ఏం చేయొచ్చన్నది తాజా ప్రయోగం అవగాహన కల్పిస్తుందని చెబుతున్నారు.