Begin typing your search above and press return to search.

నాసా-నోకియా ప్రాజెక్ట్: చంద్రుడిపైన మొబైల్ వాడొచ్చు!

By:  Tupaki Desk   |   18 Oct 2020 4:00 PM GMT
నాసా-నోకియా ప్రాజెక్ట్: చంద్రుడిపైన మొబైల్ వాడొచ్చు!
X
జాబిల్లిరావే.. చందమామా రావే అంటూ మనం పిలవడమే కానీ అది ఎప్పుడూ రాదు. మానవుడి దాన్ని చేరుకున్నాడు కానీ ఇప్పటికీ చందమామ అందని ద్రాక్షే.. ఆ అందని చందమామపై ఏకంగా ఫోన్ నెట్ వర్క్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవును. దీన్ని నిజం చేయబోతోంది ప్రపంచంలోనే అంతరిక్ష పరిశోధనల్లో నంబర్ 1 గా ఉన్న అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.

అమెరికాకు చెందిన నాసా సంస్థ తాజాగా ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియా సంస్థతో డీల్ కుదుర్చుకుంది. చంద్రుడిపై 4జీ సెల్యూలార్ కమ్యూనికేషన్ నెట్ వర్క్ ను నిర్మించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

2028 నాటికి వ్యోమగాములు చంద్రుడిపై పనులు ప్రారంభించడానికి నాసా ఇప్పటికే ప్రయోగాలు చేపట్టింది. ఈ క్రమంలోనే నోకియా సంస్థతో నాసా ఈ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.నోకియాకు ఈ మొబైల్ నెట్ వర్క్ ప్రాజెక్ట్ కోసం నాసా 14.1 మిలియన్ డాలర్ల నిధులను అందించనుంది.

మొదట జాబిల్లిపై 4జీ/ఎల్.టీ.ఈ నెట్ వర్క్ ను నోకియా నిర్మిస్తుంది. ఆ తర్వాత దాన్ని 5జీకి విస్తరిస్తుంది. ఈ వ్యవస్థతో చంద్రుడి నుంచి భూమికి సమాచార మార్పిడికి కనెక్టివిటీ పెరుగుతుందని నాసా ఈ ప్రయోగంతో ముందుకెళుతోంది. చంద్రుడిపై కమ్యూనికేషన్ నెట్ వర్క్ ను నిర్మిస్తే అక్కడికి వెళ్లే వ్యోమగాములు మొబైల్ ఫోన్ లు వినియోగించుకోవచ్చని నాసా ఈ ప్రాజెక్టును చేపట్టింది. అక్కడి రేడియేషన్, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునేలా దీన్ని నిర్మిస్తున్నారు. మరి మొబైల్ ఫోన్ లో బ్రౌజింగ్ కల.. ఈ భూమ్మీదే కాదు.. చంద్రుడిపై కూడా నెరవేరుతుందా లేదా అన్నది వేచి చూడాలి.