Begin typing your search above and press return to search.

నా ఫోన్‌ కూడా నిఘాలోనే ఉండొచ్చు: ఏపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   6 Feb 2023 4:59 PM GMT
నా ఫోన్‌ కూడా నిఘాలోనే ఉండొచ్చు: ఏపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు!
X
అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిలు తమ సొంత ప్రభుత్వమే తన ఫోన్లను ట్యాప్‌ చేయిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

ట్యాపింగ్‌ తో సొంత కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి కూడా వాట్సాప్, టెలిగ్రామ్‌ కాల్స్‌ చేసుకోవాల్సి వస్తోందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాను 11 సిమ్‌ కార్డులు మార్చుకుని ఫోన్లు చేసుకోవాల్సి వస్తోందని కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వెల్లడించారు.

స్వయంగా ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులే తన ఫోన్‌ కాల్‌ ను ట్యాప్‌ చేసి తనకు ఆ ఆడియో క్లిప్‌ పంపారని కోటంరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాను కేంద్ర హోం శాఖకు కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

వైసీపీ ఎమ్మెల్యేల ఆరోపణలు ఇలా ఉండగానే పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం సైతం ఫోన్‌ ట్యాపింగ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే తన ఫోన్‌ కూడా నిఘాలోనే ఉందనుకుంటున్నానని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అనుమానం వ్యక్తం చేశారు.

తాజాగా ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన ఎమ్మెల్యేల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తోందన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. తన ఫోన్‌ కూడా నిఘాలోనే ఉందనుకుంటున్నానని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశం కూడా లేకపోలేదని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.

ఈ నేపథ్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఏపీ రాజకీయాలను మరిన్ని రోజులపాటు కుదిపేయనుందనే విషయం తేటతెల్లమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం ట్యాపింగ్‌ పై స్పందించడం లేదు. వైసీపీ నేతలు మాత్రం శ్రీధర్‌ రెడ్డి స్నేహితుడే వాళ్లిద్దరూ మాట్లాడుకున్న ఆడియో రికార్డును ఆయనకు పంపారని ఆరోపణలు చేస్తున్నారు. శ్రీధర్‌ రెడ్డి టీడీపీలోకి వెళ్లడానికే ప్రభుత్వంపై బుర ద జల్లుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండా వేరే ఎమ్మెల్సీ కూడా ప్రభుత్వంపై ఇవే రకమైన విమర్శలు చేయడంపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.