Begin typing your search above and press return to search.

నా తదుపరి లక్ష్యం అదే.. ఓటమి పై కమల్ హాసన్ స్పందన !

By:  Tupaki Desk   |   3 May 2021 12:30 PM GMT
నా తదుపరి లక్ష్యం అదే.. ఓటమి పై కమల్ హాసన్ స్పందన !
X
సినిమా ఇండస్ట్రీలో లోక నాయకుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ , ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మక్కల్ నీది మయ్యం అనే పార్టీ పెట్టి ఆయన తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టారు. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీకి దిగిన కమల్ హాసన్ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. కమల్ హాసన్ పార్టీ పెద్దగా సీట్లు సంపాదించకపోయినప్పటికీ , అయన ఓటమిని ఎవరూ ఊహించలేదు. బీజేపీ అభ్యర్థి, మహిళా నేత వనతి శ్రీనివాసన్ చేతిలో కమల్ హాసన్ ఓటమిపాలవ్వడం గమనార్హం. 1,540 ఓట్ల స్వల్ప మెజార్టీతో కమల్ పై వనతి నెగ్గారు. ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన వారు 142 స్థానాల్లో పోటీ చేయగా ఏ ఒక్కరూ కూడా విజయం సాధించలేకపోయారు.

అయితే ,ఎన్నికల ప్రచారంలో డబ్బు, మద్యం లాంటి అంశాలతో ప్రేక్షకులను ప్రలోభపెట్టకుండా అత్యంత నిజాయితీగా కమల్ వ్యవహరించడంపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. రాజకీయాల్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌ తో ఎన్నికల రణరంగంలోకి దూకి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. పార్టీ ప్రచారానికి అయ్యే ఖర్చు తప్ప మరో రూపంలో గెలుపుకు ఖర్చు చేయలేదు. ఓటమి అనంతరం కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తాను. నాపై అభిమానం కురిపించి ఓటు వేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమకోడ్చిన కార్యకర్తలకు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను అని ట్విట్టర్ లో కమల్ హాసన్ తెలిపారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తానని ఆయన అన్నారు. తమిళనాడును అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమనే మా నినాదం కేవలం ఎన్నికల కోసం కాదు. మక్కల్ నీది మైయామ్ కల. జన్మభూమిని పరిరక్షించుకోవడానికి, నా భాషను, మా ప్రజలను సంక్షేమం కోసం మా పార్టీ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకి ప్రతి దాంట్లో కూడా తోడుగా ఉంటూ ప్రజా పోరాటం చేస్తానని చెప్పారు.