రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సీనియర్.. ఇక సినిమాలేనట.?

Mon Jan 25 2021 14:00:01 GMT+0530 (IST)

Murali Mohan Says Good Bye To Politics

రాజకీయాల్లోకి వెళ్లి ఒకసారి ఎంపీగా గెలిచి.. ఇక ఆ తర్వాత తీవ్ర ఎదురుదెబ్బలు తిన్న ప్రముఖ సీనియర్ నటుడు మాజీ ఎంపీ మురళీ మోహన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.  తన భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఇక తన దృష్టి అంతా సినిమాలపైనే ఉంటుందని మురళీ మోహన్ తెలిపారు.తాను సినిమాల నుంచి ఎదిగానని.. దాన్ని మరిచిపోనని.. మళ్లీ సినిమా రంగంలో పూర్తిగా కనిపించనున్నట్లు  మురళీ మోహన్ తెలిపారు. తన వ్యాపారాలను తమ్ముడు పిల్లలకు అప్పగించనున్నట్లు తెలిపారు.

ఇటీవలే తనకు వెన్నెముక శస్త్రచికిత్స జరిగిందని.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని మురళీ మోహన్ తెలిపారు. త్వరలోనే జయభేరి ఆర్ట్స్ లో సినిమాలు తీస్తానని.. ఇప్పటివరకు 25 సినిమాలు తీశానని తెలిపారు. మహేష్ బాబు ‘అతడు’ సినిమా మా జయభేరి సంస్థ నుంచి వచ్చిన చివరి చిత్రం అని.. ఆ  తర్వాత రాజకీయాలు వ్యాపారాల్లో బిజీ అయిపోవడంతో సినిమాలు నిర్మించలేకపోయానని చెప్పారు. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలు నిర్మించడంతోపాటుగా నటనపైనే ఉందన్నారు. పరిశ్రమలో వచ్చిన మార్పులకు అనుగుణంగా నటనను మార్చుకుంటేనే మనగడ సాధ్యమన్నారు.

దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ పూర్తి స్థాయిలో సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. తాజాగా ఆర్కా మీడియా నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు తెలిపారు. ఇందులో జగపతిబాబు శరత్ కుమార్ అన్నదమ్ములుగా నటిస్తున్నారని.. వారికి తండ్రిగా నటిస్తున్నట్టు తెలిపారు.