Begin typing your search above and press return to search.

ముంబై హాస్పిటల్ లో 26 మంది నర్సులు - 3 డాక్టర్లకు కరోనా!

By:  Tupaki Desk   |   6 April 2020 1:30 PM GMT
ముంబై హాస్పిటల్ లో 26 మంది నర్సులు - 3 డాక్టర్లకు కరోనా!
X
క‌రోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మరి భారత్ లోనూ విషం కక్కుతోంది. మొదట్లో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదైనాకూడా ..ఢిల్లీ మర్కజ్ ఘటన తరువాత దేశంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువైయ్యాయి. తాజాగా ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ కి చెందిన 3 డాక్టర్లకి - 26 మంది నర్సులకు కరోనా సోకింది. ఒకేసారి 29 మంది మెడిక‌ల్ స్టాఫ్ కు క‌రోనా పాజిటివ్ రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

దీంతో బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అప్ర‌మ‌త్త‌మైంది. ఆ హాస్పిట‌ల్ ను కంటామినేటెడ్ జోన్ గా ప్ర‌క‌టించింది. అక్క‌డ ప‌ని చేసే ప్ర‌తి డాక్ట‌ర్ - న‌ర్స్ - పేషెంట్లు - వారి అటెండెంట్లు అంద‌రినీ టెస్టు చేయాల‌ని నిర్ణ‌యించింది. అలాగే వొకార్డ్ ఆసుపత్రిగా వ్యవహరించే ఈ వైద్య శాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఆస్పత్రిలో ఉన్న రోగులకు జరిపే టెస్టుల్లో నెగెటివ్ అని తేలేంతవరకు ఎవరినీ ఇందులోకి అనుమతించడం లేదు. అలాగే ఆసుపత్రి నుంచి ఎవరూ బయటకి వెళ్ళడానికి వీల్లేదని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.

అయితే, క‌రోనా ఆ ప్రైవేటు వైద్య సిబ్బందికి ఎలా వ‌చ్చింద‌ని ఆరా తీయ‌గా - క‌రోనా వైర‌స్ ఉన్న ఓ 70 ఏళ్ల వ్య‌క్తి మార్చి 27న‌ హార్ట్ ఎటాక్ తో ఆసుప‌త్రిలో ఎమ‌ర్జెన్సీలో జాయిన్ అయ్యాడు. దీంతో ఆయ‌న‌కు తొలుత వైద్య స‌హాయం చేసిన ఇద్ద‌రు న‌ర్సుల‌కు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు నిర్థారణ అయ్యింది. దీంతో వ్యాధి క్ర‌మంగా 26 మంది న‌ర్సుల‌కు - 3 వైద్యుల‌కు సోకిన‌ట్లు తేలింది. ఎప్పుడూ రద్దీగా ఉన్న రోడ్డులోని ఈ ఆసుపత్రిలోనే కరోనా తిష్ట వేయడంతో చుట్టుపక్కల ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు.